
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రన్ అవుతోంది. ఇప్పుడిప్పుడే ఈ షోలు ట్రాక్ లో పడి ప్రేక్షకాదరణ పొందుతోంది. హౌస్ లో నాటకీయ పరిణామాలు, టాస్క్‌లు , గేమ్స్ తో కంటెస్టెంట్లు అలరిస్తున్నారు. అయితే ఇటీవల సరైన అనుమతులు లేవంటూ కన్నడ 'బిగ్ బాస్' షోను సడన్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూసివేసింది. ఆతర్వాత రెండు రోజుల తర్వాత మళ్లీ రీస్టార్ట్ చేశారు. ఈ వివాదం ముగిసింది అనుకునేలోపు ఇప్పుడు ' బిగ్ బాస్ తమిళ సీజన్ 9' షో ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుంది.
తమిళ సంస్కృతిని కించపరుస్తోందంటూ విమర్శలు..
తమిళ బిగ్ బాస్ షో ఈసారి ఏకంగా నిషేధం డిమాండ్‌ను ఎదుర్కొంటోంది. ఈ డిమాండ్‌ను లేవనెత్తింది అధికార డీఎంకే ప్రభుత్వ మిత్రపక్షమైన తమిజ్హగ వజ్వురిమై కట్చి (టీవీకే). బిగ్ బాస్ షోపై టీవీకే పార్టీ అధినేత, ఎమ్మెల్యే వేల్మురుగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ షోలో చిత్రీకరించే కొన్ని సన్నివేశాలు తమిళ సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. బిగ్ బాస్ షో కేవలం వినోదం కోసం కాదు, ఇది తమిళ సంస్కృతిని, సంప్రదాయాన్ని దెబ్బతీయడానికి, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికి ఉద్దేశించిన కార్యకలాపాలను చూపుతోంది అని వేల్మురుగన్ విమర్శించారు.
షోలో చూపించే దృశ్యాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు . అసహ్యకరమైన శరీర కదలికలు, ముద్దు సన్నివేశాలు, బెడ్‌రూమ్ దృశ్యాలు వంటివి టీనేజ్ అమ్మాయిలు, పిల్లలు సమక్షంలో కుటుంబంతో కలిసి చూడలేనివి అని అన్నారు.. ఒక ప్రధాన రాజకీయ పార్టీ మిత్రపక్షం నుంచి ఇంతటి తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ వివాదం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది.
స్పీకర్‌కు విజ్ఞప్తి.. ఆందోళనల హెచ్చరిక
వేల్మురుగన్ ఈ వివాదాన్ని అసెంబ్లీ వేదికగా లేవనెత్తేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ను కలిసి, ఈ అంశంపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తీర్మానాన్ని ఇచ్చారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ చర్చకు అనుమతించకపోతే, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, ఐటీ, ప్రసార శాఖలు జోక్యం చేసుకోని, ఈ షోను నిషేధించకపోతే... మేము ఊరుకోం అని ఆయన స్పష్టం చేశారు. బిగ్ బాస్ సెట్ వద్ద, అలాగే షోను ప్రసారం చేస్తున్న విజయ్ టెలివిజన్ కార్యాలయం వద్ద వేలాది మంది మహిళలతో కలిసి భారీ ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
►ALSO READ | Tanuj Mouli: ఒక్క హిట్‌తో మారిన మౌళి తనూజ్ లైఫ్ ! భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన నిర్మాణ సంస్థ!
ఈ 'బిగ్ బాస్ తమిళ సీజన్ 9' అక్టోబర్ 5న గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌లో 20 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. ఈ షో ప్రారంభమైన పదిరోజులకే సంస్కృతి, సంప్రదాయాల అంశంపై తమిళనాడులో ఆందోళనలు మొదలయ్యాయి.. మరి ఈ వివాదంపై షో నిర్వాహకులు, తమిళనాడు ప్రభుత్వం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..