బిగ్‌బాస్ తెలుగు 9 క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ వారం చివరి దశకు రావడంతో ఇక మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. హౌస్‌లో 88వ రోజు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. గడచిన వారాలుగా ఆటగాళ్లు ఎన్నో సవాళ్లు, భావోద్వేగాలు, విభేదాలు, స్నేహాలు ఎదుర్కొన్నారు. ఆట చివరి దశకు చేరుకోవడంతో అందరి దృష్టి ఇప్పుడు ఒకే ఒక్క లక్ష్యంపై ఉంది. అది ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం. ఈ మేరకు బిగ్‌బాస్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఛాలెంజ్‌లు, నాటకీయ పరిణామాలు ప్రేక్షకులలో ఆసక్తిని అమాంతం పెంచాయి. హౌస్‌లోని ప్రతి కంటెస్టెంట్ తన శక్తి, తెలివి, వ్యూహాలను ఉపయోగించి పోటీ పడుతున్నాడు. ప్రతి టాస్క్ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ..
ఫైనలిస్ట్ రేసు క్లైమాక్స్‌కి చేరుకున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు బిగ్‌బాస్ . మీరంతా ఇప్పటివరకూ దేని కోసం పోరాడుతున్నారో దాన్ని రివీల్ చేసే సమయం వచ్చేసింది... ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ అంటూ ఆ ట్రోఫీ ప్రాముఖ్యతను వివరించారు. ఆ షీల్డ్ కేవలం గౌరవమే కాదు... కఠిన పరిస్థితులని దాటి మీ సత్తాని పరీక్షించే సవాళ్లని ఎదుర్కొంటూ గొంగళిపురుగు నుంచి సీతాకోకచిలుకగా మారే మీ ప్రయాణానికి ప్రతీక... అది కేవలం మీలో ఒక్కరికే లభిస్తుంది. ఇదే ఆఖరి ఛాలెంజ్ అని చెప్పారు బిగ్ బాస్.
ఆఖరి ఛాలెంజ్‌లో రీతూ చౌదరి విజయం..
ఫైనలిస్ట్ రేసు నుంచి ఇప్పటికే సంజన, తనూజ, పవన్, సుమన్ శెట్టి ఔట్ అయ్యారు. కళ్యాణ్ తన దూకుడుతో రేసులో ముందున్నా.. లేటెస్ట్ టాస్క్‌లతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. బిగ్‌బాస్ ఇచ్చిన 'సాహసం చేయరా డింభకా' అనే ఆఖరి ఛాలెంజ్ కళ్యాణ్, ఇమ్మానుయేల్, రీతూ చౌదరి మధ్య జరిగింది. ఈ టాస్క్‌కి తనూజ సంచాలక్‌గా వ్యవహరించారు. ఇందులో పోటీదారులను ఫైనలిస్ట్‌గా చూడకూడదు అనుకుంటున్న మిగతా సభ్యులు వారి స్టిక్‌పై కాయిన్స్, టోకెన్స్‌ని యాడ్ చేయాలి. ఎవరి స్టిక్ కింద పడుతుందో వారు ఓడిపోయినట్లే.
ఈ ఛాలెంజ్‌లో ముందుగా ఇమ్ముకి భరణి, కళ్యాణ్‌కి సంజన, రీతూకి సుమన్ కాయిన్స్ యాడ్ చేశారు. ఆ తర్వాత డీమాన్ ఇమ్ముకి, సుమన్ కళ్యాణ్‌కి కాయిన్స్ జోడించారు. అయితే, ఈ కీలకమైన టాస్క్‌లో రీతూ చౌదరి అనూహ్యంగా గెలిచి రేసులో ముందుకు దూసుకెళ్లినట్లు సమాచారం. ఈ విజయం తర్వాత, రీతూ చౌదరి వెంటనే భరణిని మరో ఛాలెంజ్‌లో ఓడించి అతడిని కూడా ఫైనలిస్ట్ రేసు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
టాప్ 5 సమీకరణాలు గల్లంతు?
రీతూ చౌదరి విజయం టాప్ 5 సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఆమె కనుక ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీని దక్కించుకుంటే.. గట్టి పోటీని ఇస్తున్న మరో కంటెస్టెంట్‌కు టాప్ 5లో స్థానం గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కళ్యాణ్, ఇమ్మానుయేల్, తనూజ మంచి ప్రదర్శన కారణంగా టాప్ 5లో ఉంటారని అంచనా. రీతూ ఫస్ట్ ఫైనలిస్ట్‌గా వెళ్తే మాత్రం మిగిలిన స్థానం కోసం డీమాన్, భరణి, సంజన, సుమన్ శెట్టి గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. బిగ్‌బాస్ సీజన్ 9లో మొదటి ఫైనలిస్ట్ ఎవరు అవుతారు, రీతూ చౌదరి సంచలనం టాప్ 5లో ఎవరి స్థానాన్ని ప్రమాదంలో పడేస్తుంది అనేది ఈరోజు ఎపిసోడ్‌లో తేలనుంది. ఇది ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
