బిగ్ బాస్ తెలుగు 9 హౌస్‌లో అత్యంత కీలక ఘట్టం మొదలైంది. సీజన్ చివరి అంకానికి చేరుకోవడంతో.. అందరి కల అయిన 'ఫైనల్స్' బెర్త్‌ను దక్కించుకోవడం కోసం పోరాటం ఉధృతమైంది. ఈ సీజన్‌కి సరికొత్త కాన్సెప్ట్‌తో షోను మార్చేచాడు బిగ్ బాస్ . సాధారణంగా ప్రతి సీజన్‌లో ఉండే 'టికెట్ టు ఫినాలే' (Ticket to Finale) ప్రక్రియను పక్కనబెట్టారు. నేరుగా తొలి ఫైనలిస్ట్‌ను తేల్చే రణరంగం మొదలుపెట్టారు.
డెమాన్ పవన్ తో పాటు మరి కొందరు కంటెస్టెంట్‌లు తాము టికెట్ టు ఫినాలే గెలిచి తొలి ఫైనలిస్ట్‌గా నిలవాలని శపథాలు చేస్తుండగా... బిగ్ బాస్ మాత్రం వారి అంచనాలను తలకిందులు చేస్తూ, 'గడులన్నీ ఎవరు సొంతం చేసుకోగలుగుతారో... వారే మొదటి ఫైనలిస్ట్ అయ్యే గౌరవాన్ని పొందుతారు' అని ప్రకటించారు. దీంతోఈ టాస్క్ హౌస్‌లో తీవ్ర ఉత్కంఠను పెంచింది.
తనూజ.. అన్నీ తానై!
అయితే, ఈ కీలకమైన తొలి ఫైనలిస్ట్ టాస్క్‌లో ఎవరు పాల్గొనాలి? అనే విషయంలో బిగ్ బాస్ ఒక మెలిక పెట్టారు. "ఎవరెవరు పోటీపడతారో మళ్లీ అడిగినప్పుడు చెప్పండి" అంటూ కంటెస్టెంట్లకు ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చారు. అంతా ఊహించినట్టే, "నేను వెళ్తాను అంటే.. నేను వెళ్తాను" అని గొడవలు, వాదనలు మొదలవుతాయనే బిగ్ బాస్ ఈ వ్యూహాన్ని అమలు చేశారు. కానీ, హౌస్‌లో తానే అన్నీ డిసైడ్ చేయాలని భావించే తనూజ.. చోటా బిగ్ బాస్‌గా అవతారమెత్తింది. అసలు హౌస్‌మేట్స్ అభిప్రాయాలు అడగకుండానే, మొదటి రౌండ్‌కు వెళ్లే కంటెస్టెంట్ల పేర్లను తనూజ ఖరారు చేసింది. టాస్క్ అడేందుకు నేను సిద్ధం అని సంజనా ప్రకటించడంతో... దానికి తనూజ వెంటనే 'ఒకే' అని చెప్పేసింది. అప్పుడు పక్కనే ఉన్న రీతూ చౌదరి, "దేనికి ఓకే?" అని ప్రశ్నించింది. తనూజ నిమిషం కూడా ఆలోచించకుండా... కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమ్మానుయేల్‌లు ఆడతామని అడుగుతున్నారు కాబట్టి వాళ్లే ఆడతారు అని వారి పేర్లు చదివేసింది.
భరణి గోకుడు.. రీతూ ఫైర్!
ఈ అన్యాయమైన నిర్ణయంపై హౌస్‌మేట్స్‌లో అసంతృప్తి మొదలైంది. భరణి అయితే, "నేను ఈ టాస్క్ ఆడటానికి వెళ్తానంటే.. తనూజ నన్ను 'గోకుతుంది' (అంటే అనవసరంగా అడ్డుపడుతుంది)" అని బహిరంగంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక, రీతూ చౌదరి గట్టిగా తన వాదన వినిపించడం మొదలుపెట్టింది. "నేనూ ఆడతాను" అని చెప్పడంతో తనూజ రెచ్చిపోయింది. "ఆల్రెడీ ఫస్ట్ రౌండ్‌కి వెళ్లే ముగ్గురు ఎవరో ఫిక్స్ అయిపోయింది. నేను నా నిర్ణయాన్ని మార్చుకోను" అని మొండిగా చెప్పింది.
►ALSO READ | Samantha : వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్.. మొఘల్ కాలం నాటి 'పోర్ట్రెయిట్ కట్' వెనుక కథేంటి?
"బిగ్ బాస్ ఏమని చెప్పాడు? మీరంతా ఆలోచించుకుని... ఎవరు ముందు వెళ్లాలో చెప్పాలని అందరికీ చెప్పారు. కానీ ఇక్కడ తనూజ 'నా ఒపీనియన్‌ని మార్చుకోను' అని అంటుంది? అసలు నీ ఒపీనియన్ ఎవడికి కావాలీ? బిగ్ బాస్ టైమ్ ఇచ్చింది ఎందుకు? ఆలోచించి చెప్పమన్నాడు కదా?" అని నిలదీసింది. దీనికి తనూజ.. "లేదు, నువ్వు మాట్లాడాలి అనుకుంటే అప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు కాదు" అని వాదనకు దిగింది.
నా గొంతు మాత్రమే వినిపిస్తుంది!
"నేను ఆలోచించుకుంటున్నానబ్బా... మీరే మధ్యలోకి వచ్చి వాళ్ల పేర్లూ వీళ్ల పేర్లు అని చదివేశావ్. నాకు ఆలోచించుకునే టైమ్ ఇవ్వరా?" అని రీతూ గట్టిగా అడిగింది. "ఆల్రెడీ ఫిక్స్ అయిన తరువాత ఆలోచించుకోవడం ఏంటి?" అని తనూజ అరుస్తూ రంకెలేస్తుంటే... రీతూ అంతకుమించి గట్టిగా సమాధానం చెప్పింది. "ఆలోచించుకుని చెప్పమన్నారు... చెప్తున్నా... మధ్యలో నీ ప్రాబ్లమ్ ఏంటీ? అయినా నేను ఆడనని మీతో చెప్పానా? నేను ఆలోచిస్తూనే ఉన్నాను... ఆడనని చెప్పానా?" అని రీతూ ప్రశ్నించింది.
ఈ వాదనలో తనూజ.. "అరుచుకుంటూనే ఉండు రీతూ!" అని ఎగతాళి చేయగా, రీతూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది "హా... నువ్వు అనేవన్నీ అనేసి... నేను అరుస్తున్నానంటున్నావ్! నా గొంతు ఒక్కటే వినిపిస్తుంది... నువ్వు అనే మాటలే కనిపించవు" అంటూ తనూజ వైఖరిని ఎత్తి చూపింది. హౌస్‌లో ఎవరూ ప్రశ్నించడానికి సాహసించని చోట, రీతూ చౌదరి తన మాట నెగ్గించుకోవడానికి దృఢంగా నిలబడింది. చివరికి, తన మొండి వాదనతో తనూజను పక్కకు తప్పించి, తొలి రౌండ్‌లో కళ్యాణ్, ఇమ్మానుయేల్‌లతో కలిసి పోటీపడటానికి అర్హత సాధించింది.
