దక్షిణాదిలో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న సమంత మరో సారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి పెళ్లి గురించి వస్తున్న ఊహాగాలకు తెరదించుతూ.. సమంత స్వయంగా సోషల్ మీడియా వేదికగాతెలియజేశారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో సంప్రదాయబద్దంగా పెళ్లిబంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా డైమండ్ రింగ్
అయితే సమంత పెళ్లి లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎరుపు రంగు పట్టు బనారస్ చీరలో సంప్రదాయ ఆభరణాలు, పరిపూర్ణమైన మేకప్‌తో మెరిసిపోతున్నారు. ఆమె రూపాన్ని చూసి అభిమానులు ముగ్ధులయ్యారు. అయితే అందరి దృష్టిని ప్రత్యే్కంగా ఆకర్షించింది మాత్రం ఆమె ధరించిన వింటేజ్ స్టైల్ డైమండ్ వెడ్డింగ్ రింగ్ .
' పోర్ట్రెయిట్ కట్' వెనుక కథ
చేతితో తయారు చేసిన ఈ అరుదైన వజ్రపు ఉంగరం వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఇది ఏథెన్స్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల డిజైనర్ థియోడోరోస్ సావోపౌలోస్ రూపొందించిన రింగ్ ఇది. ఈ డిజైనర్ లైమ్‌లైట్‌కి దూరంగా ఉంటూ, ప్రతి సంవత్సరం చాలా పరిమిత సంఖ్యలోనే ఈ ఆభరణాలను తయారు చేస్తారు. అది కూడా కేవలం అత్యంత ఎంపిక చేసిన ఖాతాదారుల కోసం మాత్రమే రూపొందిస్తారు. సహజత్వం, ఆకట్టుకునే డిజైన్‌లు, ప్రత్యేకమైన ఆధునిక శైలికి సావోపౌలోస్ ప్రసిద్ధి.
Also Read : Ranveer Singh Apologizes: 'కాంతార' అనుకరణ వివాదం
ఈ ఉంగరంలో ఉన్న వజ్రం 'పోర్ట్రెయిట్-కట్ డైమండ్' . దీనికి సుదీర్ఘమైన చరిత్ర కూడా ఉంది. ఈ కట్ ప్రాచీన భారతదేశంలో ఉద్భవించింది. మొఘల్ యుగంలో, ముఖ్యంగా చక్రవర్తి షాజహాన్ కాలంలో ఈ కట్ ప్రాచుర్యం పొందింది. ఒకప్పుడు సూక్ష్మ చిత్రాలను రక్షించడానికి, వాటి అందాన్ని పెంచడానికి ఈ పల్చని, పారదర్శకమైన వజ్రాలను ఉపయోగించేవారు. అందుకే దీనికి 'పోర్ట్రెయిట్ కట్' అనే పేరు వచ్చింది. ఈ కట్ యొక్క స్పష్టత , సున్నితత్వం, పాతకాలపు ఆకర్షణ నేటికీ దీనిని అత్యంత విలువైనదిగా ఉంది. ఈ అపురూపమైన రింగ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, రాజ్ నిడిమోరు సమంతపై తనకున్న ప్రేమను, ఆమె చరిత్రను, కళను ఎంతగా అభిమానిస్తారో తెలియజేస్తోందని అభిమానులు అంటున్నారు.
సమంత, రాజ్ లవ్ స్టోరీ..
సమంత, రాజ్ నిడిమోరుల ప్రయాణం వృత్తిపరంగా మొదలై ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి తొలిసారిగా సమంత మొదటి OTT ప్రాజెక్ట్ అయిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' (The Family Man 2) లో పనిచేశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్‌లో పనిచేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్'సిరీస్‌లో కూడా వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు.
రాజ్ నిడిమోరు గతంలో శ్యామలి దే తో వివాహ బంధంలో ఉండేవారు, వారు 2022లో విడాకులు తీసుకున్నారు. సమంత కూడా 2021లో నటుడు నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అందమైన జంట ఇప్పుడు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుండగా, అభిమానులు, సినీ పరిశ్రమ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజ్ ఇచ్చిన వింటేజ్ డైమండ్ రింగ్ లాగానే, వారి వైవాహిక జీవితం కూడా కలకాలం నిలిచే అరుదైన ప్రేమతో నిండి ఉండాలని అభిమానులు ఆశిస్తూ.. పోస్టు చేస్తున్నారు..
