ఫీల్డ్‌‌లో తక్కువ.. పాస్‌‌బుక్‌‌లో ఎక్కువ

ఫీల్డ్‌‌లో తక్కువ..  పాస్‌‌బుక్‌‌లో ఎక్కువ
  • అదనంగా రికార్డుల్లోకెక్కిన 6.50 లక్షల ఎకరాలు
  • అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి ఎక్కువగా నమోదు
  • పాస్ బుక్స్‌‌లో విస్తీర్ణాన్ని సవరించాలంటున్న నిపుణులు
  • ధరణి పోర్టల్ ప్రక్షాళనకు ఇదే పెద్ద సవాల్‌‌ అని వెల్లడి

గతంలో నల్గొండ జిల్లా పానగల్లును శాంపిల్ విలేజీగా తీసుకుని భూరికార్డులను కాగ్ బృందం పరిశీలించింది. సేత్వార్ రికార్డుకు, పహాణీలకు మధ్య 819.35 ఎకరాల భూమి తేడా ఉన్నట్లు గుర్తించింది. ఈ గ్రామ సేత్వార్ రికార్డు ప్రకారం 3,073 ఎకరాలు ఉండగా.. పహాణీల్లో మాత్రం 3,893.33 ఎకరాల భూమి నమోదైంది. రెవెన్యూ రికార్డుల్లో ఏటేటా రెవెన్యూ సిబ్బంది భూవిస్తీర్ణాన్ని బై నంబర్లతో పెంచుతూ పోవడంతోనే ఇలా పాస్ బుక్స్ లో విస్తీర్ణానికి మించి నమోదైనట్లు గుర్తించారు. ఇలా అనేక గ్రామాల్లో 10 నుంచి 20 శాతం భూమి అదనంగా నమోదైంది.

కరీంనగర్, వెలుగు: ధరణిలో నమోదై, పాస్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపుతున్న భూవిస్తీర్ణానికి.. ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న భూమికి చాలా తేడాలున్నట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. 1956 నాటి సేత్వార్ (రీసర్వే సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రిజిస్టర్ – ఆర్ఎస్ఆర్) రికార్డుతో పోల్చితే గత 60 ఏండ్లలో రికార్డుల్లో సుమారు 6.50 లక్షల ఎకరాల భూమి ఎక్కువగా నమోదైనట్లు తెలిసింది. దీంతో పాస్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికంగా ఉన్న విస్తీర్ణాన్ని సవరించాల్సి ఉంది. ఇప్పటికే చాలా మంది తమకు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న భూమికి, పాస్ బుక్స్ లో నమోదైన విస్తీర్ణానికి సరిపోలడం లేదంటూ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు పాస్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భూమి  ఎక్కువగా నమోదైన వారు మాత్రం తమకు రైతుబంధు లాంటి స్కీమ్స్ వస్తుండడంతో పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విస్తీర్ణం తగ్గించుకునేందుకు ముందుకు రావడం లేదు. 

సమగ్ర భూసర్వేతోనే పరిష్కారం

భూరికార్డుల ప్రక్షాళనలో పాత పహాణీలు, పాస్ బుక్స్ ఆధారంగా కొత్త పాస్ బుక్స్ జారీ చేశారు. ఈ క్రమంలో సేత్వార్ లో ఉన్న విస్తీర్ణానికి మించి పాస్ బుక్స్ లో భూవిస్తీర్ణం నమోదైంది. సేత్వార్ డేటాను కూడా ధరణి పోర్టల్ లో గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా అప్ డేట్ చేశారు. దీంతో సేత్వార్ రికార్డుకు, పాస్ బుక్ కు మధ్య భూవిస్తీర్ణంలో తేడాలున్న వారు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్, ఇతర అప్ డేషన్ కోసం అప్లై చేస్తే ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అని చూపిస్తున్నది. దీంతో ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో పట్టాదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో నిజాం హయాంలోనే చివరిసారిగా 1940లో సమగ్ర భూసర్వే జరిగింది. ప్రతి 30 ఏండ్లకోసారి జరగాల్సిన రీసర్వే 80 ఏండ్లు దాటినా జరగలేదు. ఈ క్రమంలోనే కొందరు తమ వద్ద లేని భూమికీ హక్కులు పొందారు. రెవెన్యూ యంత్రాంగం చాలా చోట్ల తమ రికార్డుల్లో భూమిని పెంచేశారు. కొన్ని చోట్ల అమ్మిన భూమిని సంబంధిత రైతు ఖాతా నుంచి తొలగించకుండానే కొత్త సబ్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ ను సరిదిద్దాలంటే సమగ్ర భూసర్వేతోనే సాధ్యమవుతుందని రెవెన్యూ చట్టాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సమగ్ర భూసర్వే చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. సీఎం హోదాలో కేసీఆర్ పలుమార్లు ప్రకటించినా ఇది అమల్లోకి రాలేదు. దీంతో హద్దుల సమస్యలు.. రికార్డుకు, ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేడాలు పెరిగిపోయాయి. రీసర్వేతోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ధరణి సమస్యల వేదిక ప్రతినిధులు మన్నె నర్సింహారెడ్డి, గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి సూచించారు.

పాస్ బుక్స్ జారీ కాని భూములు18.50 లక్షల ఎకరాలు

రాష్ట్రంలో సాదాబైనామాతోపాటు, ఇతర కారణాలతో డిజిటల్ సైన్ చేయకపోవడం వల్ల పాస్ బుక్స్ నిలిచిపోయిన పట్టా భూములు ధరణి పోర్టల్ లో 18.50 లక్షల ఎకరాల దాకా ఉన్నట్లు తెలిసింది. ఆయా భూములపై పట్టాదారు కాలమ్ లో కొన్ని చోట్ల రైతుల పేర్లు కనిపిస్తున్నా.. వివిధ కారణాలతో పాస్ బుక్స్ నిలిపివేశారు. ఇందులో సాదాబైనామా కింద కొనుగోలు చేసిన భూములే ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త ఆర్వోఆర్ యాక్ట్ ప్రకారం పాత సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించే మార్గంలేకుండా పోయింది. అందుకే ఈ చట్టానికి సవరణ చేస్తేనే పాస్ బుక్స్ జారీ చేయొచ్చని భూచట్టాల నిపుణుడు, ధరణి అధ్యయన కమిటీ సభ్యుడు సునీల్ అభిప్రాయపడ్డారు.