ఒక మనిషి సాటి మనిషి పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇటీవలి కాలంలో తీవ్ర ఆందోళనకు గరిచేస్తోంది. తన కంఫర్ట్ కోసం ఇతరులను చంపేంత క్రిమినల్ మెంటాల్టీతో దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. కేరళలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే.. కొందరు ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తున్నారు..? అనే ప్రశ్న తలెత్తక మానదు.
తిరువనంతపురం సమీపంలో వర్కల దగ్గర.. యువతిని వేగంగా వెళ్తున్న రైలు నుంచి తోసేశాడు ఒక వ్యక్తి. డోర్ దగ్గర ప్లేస్ ఇవ్వలేదని కాలితో తన్నడమే కాకుండా ఏకంగా రన్నింగ్ ట్రైన్ లో నుంచి తోసేశాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడిని పంచమూడు కు చెందిన సురేష్ కుమార్ (50)గా గుర్తించినట్లు చెప్పారు. తాగిన మైకంలో యువతులతో గొడవ పడి ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు.
ఈ ఘటనలో రైలు నుంచి కింద పడిన శ్రీకుట్టి (20) పలోడే గ్రామానికి చెందిన యువతిగా చెప్పారు పోలీసులు. మద్యం మత్తులో ఉన్న సురేష్ తోసేయటంతో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. సరేష్ పై BNS సెక్షన్ 109 ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
శ్రీకుట్టి పీటీపీ నగర్ కు చెందిన తన ఫ్రెండ్ అర్చన (19) తో కలిసి కేరళ ఎక్స్ ప్రెస్ లో అలువ నుంచి తిరువనంతపురం వెళ్తోంది. డోర్ దగ్గర ఇద్దరు ఫ్రెండ్స్ నిలబడి ఉండగా.. సరేష్ అనే వ్యక్తి వచ్చి తనకు డోర్ దగ్గర స్థలం ఇవ్వాలని.. వెనకకు రావాలని అడిగాడు. తాము ఆల్ రెడీ నిలుచున్నాం కదా అని అనటంతో గొడవకు దిగాడు. వెనక్కు వస్తారా లేదా అంటూ గట్టిగా అరవటం మొదలెట్టాడు. దీంతో జరిగిన గొడవలో.. శ్రీకుట్టిని కాలుతో తన్ని బయటకు తోసేసినట్లు ఆమె ఫ్రెండ్ అర్చన పోలీసులకు తెలిపింది.
శ్రీకుట్టి తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతోంది. ఆమెకు సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. నిందితుడు సురేష్ కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు.
