ప్రస్తుత డిజిటల్ ప్రపపంలో సైబర్ మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ కేటుగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారు. తేరుకునే లోపు జరగరానిది జరిగిపోతోంది. లేటెస్ట్ గా కన్నడ రియల్ స్టార్ గా నటుడు ఉపేంద్ర, ఆయన సతీమణి ప్రియాంక ఉపేంద్ర ఇటీవల భారీ సైబర్ మోసానికి గురయ్యారు. హ్యాకర్లు వారి మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి.. ఏకంగా రూ. 1.5 లక్షల వరకు కాజేశారు. ఈ కేసులో కర్ణాటక పోలీసులు వేగంగా స్పందించి, బిహార్‌కు చెందిన ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.
మోసం జరిగింది ఇలా..
సెప్టెంబరు 15న ఈ ఘటన జరిగింది. ప్రియాంక ఉపేంద్ర ఆన్‌లైన్‌లో ఒక వస్తువును బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఫోన్‌కు ఒక హానికరమైన (Malicious) లింక్ వచ్చింది. ప్రియాంక ఆ లింక్‌ను క్లిక్ చేయగానే, ఆమె వాట్సాప్ ఖాతా వెంటనే హ్యాకర్ల వశమైంది. హ్యాకర్లు అకౌంట్‌ను నియంత్రణలోకి తీసుకుని, వెంటనే ప్రియాంక కాంటాక్టులకు సందేశాలు పంపడం మొదలుపెట్టారు. 'అత్యవసరంగా డబ్బు అవసరం, వెంటనే రూ. 55,000 ట్రాన్స్‌ఫర్ చేయండి' అంటూ అభ్యర్థిస్తూ మెసేజ్ లో వెళ్లాయి. ఈ మెసేజ్‌లు నిజంగా ప్రియాంక నుంచే వచ్చాయని నమ్మిన చాలా మంది వ్యక్తులు వారికి డబ్బు పంపారు.
కుటుంబ సభ్యులే మోసపోయారు..
మోసం జరిగిందని గుర్తించని ప్రియాంక.. జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడానికి తన భర్త ఉపేంద్రకు, అలాగే వారి మేనేజర్‌కు కాల్ చేయాలని ప్రయత్నించారు. అయితే అప్పటికే ఉపేంద్ర ఫోన్, మేనేజర్ ఫోన్ కూడా హ్యాక్ అయ్యాయి. ఇంకా విస్మయకరమైన విషయం ఏమిటంటే.. ఈ మెసేజ్‌లు తన తల్లి నుంచే వచ్చాయని నమ్మి, ఈ దంపతుల కుమారుడు కూడా ఏకంగా రూ. 50,000 హ్యాకర్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ విధంగా కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది కాంటాక్టుల నుంచి మొత్తం రూ. 1.5 లక్షలు హ్యాకర్లు దోచుకున్నారు.
బిహార్‌లో మూలాలు
సైబర్ మోసం జరిగిందని గ్రహించిన ఉప్రేంద్ర, ప్రియాంక వెంటనే బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ సైబర్ క్రైమ్ మార్గాన్ని ట్రేస్ చేశారు. దాని మూలాలు బిహార్‌లోని దశరథ్‌పూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా, ప్రధాన నిందితుడు వికాస్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం బెంగళూరుకు తీసుకువచ్చారు. పోలీసుల సమాచారం ప్రకారం, వికాస్ కుమార్, అతని సహచరులు పెద్ద ఎత్తున సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా, ఆ ప్రాంతంలో దాదాపు 150 మందికి పైగా యువకులు ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ కేసును సెంట్రల్ డివిజన్ సైబర్ పోలీస్, సదాశివనగర్ పోలీస్‌లు సంయుక్తంగా విచారిస్తున్నారు. సెలబ్రిటీలనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. మోసగాళ్లు అధునాతన పద్ధతులైన ఫిషింగ్ లింక్‌లు, సిమ్ స్వాప్ ఫ్రాడ్, నకిలీ ఉద్యోగ ప్రకటనలను ఉపయోగిస్తున్నారు. డబ్బు, వ్యక్తిగత సమాచారం కోల్పోకుండా ఉండాలంటే, అపరిచిత లింక్‌లు, OTP షేరింగ్‌పై అత్యంత అప్రమత్తత పాటించాలని, బలమైన పాస్‌వర్డ్‌లు వాడటం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
