ఇండిగో సంక్షోభానికి 2 కీలక కారణాలు.. రెండు నెలల్లో 1000 మంది పైలట్స్ కావాలంట..?

ఇండిగో సంక్షోభానికి 2 కీలక కారణాలు.. రెండు నెలల్లో 1000 మంది పైలట్స్ కావాలంట..?

దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో చరిత్రలో ఎన్నడూ లేనంతగా విమానాల రద్దుతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నవంబర్ 2025లో తమ రోజువారీ విమానాల సంఖ్యను 2,300కు పైగా పెంచిన ఇండిగో.. అదే సమయంలో అమలులోకి వచ్చిన కొత్త 'ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనలను పాటించలేక, వందలాది విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీని వెనుక అసలు కారణం భారీగా సర్వీసుల విస్తరణకు అనుగుణంగా పైలట్ల నియామకం జరగలేదని తేలింది. దీనికి తోడు క్యాబిన్ క్రూ షార్టేజ్ కూడా ఉన్నట్లు గుర్తించబడింది. 

2025 ఆర్థిక సంవత్సరంలో ఇండిగో అత్యధికంగా విమాన సర్వీసులు విస్తరణను పెంచింది. అదే సమయంలో లండన్, మాంచెస్టర్, ఆమ్‌స్టర్‌డ్యామ్, ఏథెన్స్ వంటి అంతర్జాతీయ రూట్లలో కొత్తగా డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్లను స్టార్ట్ చేసింది. అయితే సామర్థ్యం పెంచిన స్థాయిలో పైలట్ల నియామకం జరగలేదు. FY25లో ఇండిగో కేవలం 418 మంది కొత్త పైలట్లను మాత్రమే నియమించింది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం తర్వాత అత్యంత తక్కువ రిక్రూట్మెంట్స్‌గా తేలింది. పైగా ఇది కరోనా సమయానికి ముందు చేపట్టిన రిక్రూట్మెంట్ కంటే కూడా చాలా తక్కువే. ఈ భారీ అంతరం కారణంగానే కొత్త FDTL నిబంధనలు అమలులోకి వచ్చినప్పుడు ఇండిగో తన విమానాలను నడపడానికి తగినంత మంది పైలట్లను సమకూర్చలేకపోయింది. ఇండిగో తమ వద్ద ఉన్న ఎయిర్‌బస్ విమానాలకు అవసరమైన 2,422 మంది పైలట్లకు గాను.. కేవలం 2,357 మంది మాత్రమే కలిగి ఉన్నట్లు అంగీకరించింది. నవంబర్‌లో ఎయిర్‌బస్ ఆపరేషన్స్ కోసం సీనియర్ కెప్టెన్‌ల నియామక డ్రైవ్‌ను కూడా ప్రకటించింది.

ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని డీజీసీఏ ఫిబ్రవరి 10, 2025 వరకు కొత్త నిబంధనల అమలులో కొంత సడలింపు ఇచ్చింది ఇండిగోకు. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల ప్రకారం.. పైలట్ల విశ్రాంతి సమయాన్ని పెంచారు. ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య 'నైట్ ల్యాండింగ్స్' సంఖ్యను ఆరు నుంచి రెండుకి తగ్గించారు. ఈ మార్పుల వల్ల విమానయాన సంస్థలకు ఎక్కువ మంది పైలట్ల అవసరం ఏర్పడింది. ఈ కొత్త నిబంధనలను పూర్తిగా పాటించడానికి ఇండిగోకు రాబోయే రెండు నెలల్లో మరో వెయ్యి మంది పైలట్లు అవసరం అవుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇతర ఎయిర్‌లైన్స్ నుంచి పైలట్లను తీసుకోవాలనుకున్నా.. కెప్టెన్‌లకు 12 నెలలు, కో-పైలట్‌లకు 6 నెలల నోటీస్ పీరియడ్ ఉంది. అందువల్ల వెంటనే ఇండిగోకు రిలీఫ్  దొరికే పరిస్థితులు కనిపించటం లేదు పైలట్ల షార్టేజ్ విషయంలో. కేవలం ఉన్న ఆప్షన్ కంపెనీ తన సర్వీసుల సంఖ్యను ప్రస్తుత పైలట్ల సంఖ్యకు అనుగుణంగా తగ్గించుకోవటం మాత్రమేనని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 300-400 విమానాలను తగ్గించాలని సంస్థ కూడా భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఎయిర్ ఇండియా, ఆకాశా ఎయిర్ వంటి సంస్థల్లో కొన్ని విమానాలు గ్రౌండ్ కావడంతో వారి వద్ద అదనపు పైలట్లు అందుబాటులో ఉన్నారు. ఇది ఇండిగోకు ఒక చిన్న ఉపశమనం కావచ్చని తెలుస్తోంది.

భారత విమానయాన రంగంలో దాదాపు 65 శాతం మార్కెట్ వాటా హోల్డ్ చేస్తున్న ఇండిగో దశాబ్దం చివరి నాటికి 600 కంటే ఎక్కువ విమానాలు కలిగిన సంస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా ఇండిగో తమ "కాడెట్ పైలట్ ఇనిషియేటివ్"ను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా నైపుణ్యం కలిగిన పైలట్ల కోసం ప్రస్తుతం తొమ్మిది ఏవియేషన్ అకాడమీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మెుత్తానికి ప్రస్తుత సంక్షోభం ఇండిగో సంస్థకు ఒక పెద్ద గుణపాఠం అని చెప్పుకోవచ్చు. పైలట్ల కొరతను సరిగ్గా అంచనా వేయకపోవడం సంస్థ ప్రతిష్టకు, ప్రయాణికుల నమ్మకాన్ని కోల్పోగా.. ఈ పరిస్థితులను ఎలా అధిగమిస్తుందో చూడాలి.