ఈ వింత ఎక్కడైనా చూశారా.. నడిరోడ్డుపై..అదీ జాతీయ రహదారిపై పెద్దపెద్ద చెట్లు..

ఈ వింత ఎక్కడైనా చూశారా.. నడిరోడ్డుపై..అదీ జాతీయ రహదారిపై పెద్దపెద్ద చెట్లు..
  • వంద కోట్లతో  రోడ్డు..మధ్యలో చెట్లు..హైవే విస్తరణలో చెట్లు కొట్టేయని సిబ్బంది 
  • బిహార్​లోని పాట్నా- గయా  హైవే విస్తరణలో చెట్లు కొట్టేయని సిబ్బంది
  • అటవీశాఖ అనుమతివ్వలేదని  అధికారుల వివరణ

జెహనాబాద్​(పాట్నా): రోడ్డుకు రెండు వైపులా చెట్లుండడం కామన్. డివైడర్లలో మొక్కలను పెంచడమూ చూస్తుంటాం, కానీ నడిరోడ్డు మీద, అదీ జాతీయ రహదారి మధ్యలో పెద్ద పెద్ద చెట్లుంటే..? అదెలా సాధ్యమని అనుకోవద్దు. బిహార్ లోని పాట్నా– గయా హైవేపై జెహనాబాద్​ జిల్లాలో రోడ్డుపైనే చెట్లను చూడొచ్చు. ఈ రోడ్డు చెట్ల మధ్యలో నుంచే ఏడున్నర కిలోమీటర్లు సాగుతుంది. బిహార్ ప్రభుత్వం ఇటీవలే ఈ హైవేను నాలుగు లేన్ల రహదారిగా మార్చింది. విస్తరణకు రూ.100 కోట్లు కేటాయించింది. 

కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ వేగంగా పనులు చేపట్టి రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్లకు అభివృద్ధి చేసింది. అయితే, జెహనాబాద్ సమీపంలో దాదాపు ఏడున్నర కిలోమీటర్ల మేర అప్పటి వరకు అక్కడున్న చెట్లను తొలగించకుండా వాటి కింది నుంచే రోడ్డు వేసింది. దీంతో ఆ ఏరియా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాగా మారింది. హైవేపై వేగంగా దూసుకెళ్లే వాహనాలు ఈ చెట్ల 
కారణంగా ప్రమాదాలకు గురవుతున్నాయి.

అటవీశాఖే కారణం..

పాట్నా– గయ రహదారి విస్తరణ పనులు చేపట్టిన తర్వాత రోడ్డు పక్కనే ఉన్న చెట్లను తొలగించేందుకు అటవీశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించామని కలెక్టరేట్​ అధికారులు తెలిపారు. అయితే, దీనికి ప్రత్యామ్నాయంగా 14 ఎకరాల ల్యాండ్ ను తమకు అప్పగించాలని అటవీశాఖ జవాబిచ్చిందన్నారు. దీంతో ఈ ప్రతిపాదనపై పీటముడి నెలకొందన్నారు. గడువులోపు పనులు పూర్తిచేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ పనులు కొనసాగించారని వివరించారు. దీంతో రోడ్డు మధ్యలోని చెట్లను అలాగే వదిలేసి వాటి పక్క నుంచే రోడ్డు వేసుకుంటూ వెళ్లారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ చెట్లను తొలగించాలని సమీప గ్రామస్తులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.