సూర్యాపేటలో బీహార్ కూలీల అరాచకం : పోలీసులను పరిగెత్తించి కొట్టారు.. రాళ్లుతో దాడి

సూర్యాపేటలో బీహార్ కూలీల అరాచకం : పోలీసులను పరిగెత్తించి కొట్టారు.. రాళ్లుతో దాడి

సూర్యాపేట జిల్లాలో బీహార్ కూలీలు బీభత్సం చేశారు. రోడ్లపై వీళ్ల విధ్వంసం చూసి భయంలో పరుగులు తీశారు పోలీసులు. జనం అయితే వణికిపోయారు. పాలకీడు మండలం జాన్ పాడు డక్కెన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన ఘటన సంచలనంగా మారింది. 2025, సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా పాలకీడులో డక్కెన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ చాలా మంది బీహార్ కూలీలు పని చేస్తున్నారు. ఇటీవల ఫ్యాక్టరీలో పని చేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోయాడు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని యాజమాన్యం అప్పట్లో ప్రకటించింది. రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వకపోవటంతో బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు అందరూ సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం ఫ్యాక్టరీ ఆఫీసుకు వచ్చారు. 

నష్టపరిహారం విషయంలో మేనేజ్ మెంట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవటంతో.. బీహార్ కూలీలు అందరూ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. ఫ్యాక్టరీ ఆఫీస్ ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. ఆఫీస్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. 

ALSO READ : పైలట్లను నిందించడం దురదృష్టకరం

విషయం తెలిసి ఫ్యాక్టరీకి వచ్చిన పోలీసులపైనా తిరగబడ్డారు బీహార్ కూలీలు. ఫ్యాక్టరీ ఆవరణలో అరాచకం చేశారు. పరిస్థితి చక్కదిద్దటానికి ప్రయత్నించిన పోలీసులను తరిమి తరిమి కొట్టారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ ను కూలీలు పరిగెత్తించి మరీ కొట్టారు. పోలీస్ జీపుపై రాళ్లు రువ్వారు. ఫ్యాక్టరీ ఆఫీసుపైనా రాళ్లు రువ్వారు. అడ్డొచ్చిన అందర్నీ కొట్టారు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయటంతోపాటు.. రాళ్లతో విచక్షణారహితంగా దాడికి దిగారు. హోంగార్డ్ కు గాయాలు అయ్యాయి. ఈ పరిణామాలతో డక్కెన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో హై టెన్షన్ నెలకొంది. 

విషయం తెలిసి భారీ సంఖ్యలో పోలీసులు ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాళ్లతో దాడి చేసినోళ్లను.. పోలీసులను పరిగెత్తించి కొట్టిన బీహార్ కూలీలపై కేసులు పెట్టారు.