పైలట్లను నిందించడం దురదృష్టకరం: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

పైలట్లను నిందించడం దురదృష్టకరం: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా పైలట్లను నిందించడం బాధ్యతారాహిత్యం, దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్వతంత్ర, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం (సెప్టెంబర్ 22) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

 జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌ వాదనలు విన్నది.సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హాజరై వాదనలు వినిపించారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక విడుదల చేసిందని.. ఇందులో పైలట్ల తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఏఏఐబీ స్పష్టం చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ప్రశాంత్ భూషణ్. 

ఈ క్రమంలో ఏఏఐబీ ప్రాథమిక నివేదికలోని కొన్ని అంశాలపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాథమిక విచారణ ఆధారంగా పైలట్లను నిందించడం దురదృష్టకరమని మండిపడింది. పైలట్లలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని సూచించే మీడియా నివేదికలను చాలా బాధ్యతారహితమైనవిగా పేర్కొంది. ప్రాథమిక నివేదిక ఆధారంగా పైలట్లను నిందిస్తే.. తుది విచారణలో వారి తప్పు లేదని తేలితే ఏం చేస్తారని ప్రశ్నించింది. 

ALSO READ : ఎనిమిది బాంబులేసిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్.. 

అనంతరం ఈ ప్రమాదంపై స్వతంత్ర, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ కు తమ ప్రతి స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. కాగా, 2025, జూన్ 12న గుజరాత్‎లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 270 మంది మరణించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.