ఎనిమిది బాంబులేసిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్.. సుమారు 30 మందికి పైగా మృతి

ఎనిమిది బాంబులేసిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్.. సుమారు 30 మందికి పైగా మృతి

పాకిస్తాన్: ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్పై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బాంబులేసింది. ఈ వైమానిక దాడుల్లో సుమారు 30 మందికి పైగా పాకిస్తాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్పై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎనిమిది ఎల్ఎస్-6 (LS-6) బాంబులేసింది. తిర్హా వ్యాలీలోని మాత్రే దారా గ్రామం ఈ వైమానిక దాడుల్లో దారుణంగా దెబ్బతినడం గమనార్హం.

ఈ బాంబు దాడుల అనంతరం బాధితుల ఆర్తనాదాలు, హాహాకారాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాంబు దాడుల్లో గాయపడిన చిన్నారులను, మహిళలను ఆసుపత్రులకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన తీర్హా వ్యాలీ టార్గెట్గా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బాంబులేసింది.

కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో భాగంగా ఈ బాంబు దాడులు చేసినట్లు పాక్ వైమానిక దళం తెలిపింది. ఇదిలా ఉండగా.. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ కొన్నేళ్లుగా ఎంతో మంది అమాయక పౌరులను ఈ డ్రోన్ బాంబు దాడుల్లో కోల్పోయింది. ఈ ప్రావిన్స్లో ఉంటున్న అమాయక ప్రజలకు రక్షణ కల్పించడంలో పాకిస్తాన్ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని దక్షిణాసియా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ ఇసబెల్లే లస్సే చెప్పారు.

ALSO READ : ముచ్చట్లు వద్దు.. ముందు మీరు విదేశీ విమానాల్లో తిరగడం ఆపండి

ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 605 టెర్రర్ దాడులు జరగగా.. 2025 జనవరి నెలలో, ఆగస్ట్ నెలలో 138 పౌరులు, 79 మంది పాకిస్తాన్ పోలీసులు ఈ ప్రావిన్స్లో జరిగిన ఉగ్రదాడుల్లో చనిపోయారు. 2025 ఆగస్ట్ నెలలోనే సుమారు 129 ఉగ్రదాడి ఘటనలు జరిగాయంటే ఈ ప్రాంతంలో ప్రజలు ఎంతలా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు.