
న్యూఢిల్లీ: స్వదేశీ మంత్రం జపిస్తోన్న ప్రధాని మోడీకి ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు స్వదేశీ వస్తువులను కొనమని మోడీ చెబుతున్నారు. కానీ ఆయన ప్రయాణించే విదేశీ విమానం, ఆయన ఉపయోగించే విదేశీ వస్తువుల సంగతేంటని ప్రశ్నించారు. ప్రజలకు ప్రసంగాలు ఇవ్వడం కాదని.. ఆచరణలో చూపించాలని చురకలంటించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు కేజ్రీవాల్.
‘‘స్వదేశీ ఉత్పత్తులను వాడటం మీరే ఎందుకు ప్రారంభించకూడదు..? మీరు రోజూ ప్రయాణించే విదేశీ విమానాలను ఎందుకు వదులుకోకూడదు..? రోజంతా మీరు ఉపయోగించే అన్ని విదేశీ వస్తువులను ఎందుకు వదులుకోకూడదు..? భారతదేశంలో పనిచేస్తున్న నాలుగు అమెరికన్ కంపెనీలను ఎందుకు మూసివేయకూడదు..?’’ అని మోడీని ప్రశ్నించారు కేజ్రీవాల్. దేశ ప్రజలు తమ ప్రధానమంత్రి నుంచి చర్యను ఆశిస్తున్నారని.. ప్రసంగాలు కాదని అన్నారు.
జీఎస్టీ 2.0 సంస్కరణల అమలు సందర్భంగా 2025, సెప్టెంబర్ 21న ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దేశ పౌరులు స్వావలంబన వైపు పయనించాలని, విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. విదేశాలపై ఆధారపడటమే మన దేశ అతిపెద్ద శత్రువు అని అన్నారు. మన దేశంలో తయారైన ఉత్పత్తులను, మన దేశ యువత కష్టపడి తయారు చేసిన ఉత్పత్తులను కొనాలని పౌరులకు స్వదేశీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ స్వదేశీ జపానికి కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు.