వీడియో: వ్యాక్సిన్ ఎక్కించకుండానే ఇంజెక్షన్ చేసిన నర్సు

వీడియో: వ్యాక్సిన్ ఎక్కించకుండానే ఇంజెక్షన్ చేసిన నర్సు

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. బీహార్‌లో కూడా మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. ఈ డ్రైవ్‌లో  ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని.. వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. కాగా.. సరన్ జిల్లాలోని చాప్రాలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఒక అనూహ్య ఘటన జరిగింది. సిరంజీలో వ్యాక్సిన్ లేకుండానే ఇంజెక్షన్ చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో అధికారులు సదరు నర్సుపై చర్యలు తీసుకున్నారు.

ఈ సంఘటన జూన్ 21న బడా ఇమాంబర ప్రాంతానికి సమీపంలో ఉన్న చాప్రాలోని 1వ వార్డులో జరిగింది. అజహర్ అనే ఒక వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోవడానికి సెంటర్‌కి వెళ్లాడు. అక్కడ వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎక్కువగా ఉండటంతో.. వైద్య సిబ్బంది త్వరత్వరగా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. కాగా.. ఈ క్రమంలో చందా కుమారి.. అజహర్‌కు సిరంజీలో వ్యాక్సిన్ ఎక్కించకుండానే ఇంజెక్షన్ చేసింది. అజహర్ వ్యాక్సిన్ తీసుకుంటుండగా.. అతని స్నేహితుడు వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై సరన్ జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. నర్సు చందా కుమారికి షోకాజ్ నోటీసు జారీ చేశామని..  48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. అంతేకాకుండా.. నర్సును వ్యాక్సినేషన్ విధుల నుంచి తొలగించారు. అయితే.. నర్సు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదని ఆయన అన్నారు. టీకా కేంద్రంలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్లే ఈ పొరపాటు జరిగిందని ఆయన అన్నారు. బాధితుడు తనకు వీలైన రోజున వచ్చి వ్యాక్సిన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఖాళీ వ్యాక్సిన్ తీసుకున్న అజహర్ మాట్లాడుతూ.. నర్సు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని అన్నాడు. అయితే ఇది మాత్రం చాలా పెద్ద పొరపాటని.. వ్యాక్సిన్ కేంద్రంలో క్యూలో చాలామంది ఉండటం వల్లే ఇలా జరిగిందని అజహర్ వ్యాఖ్యానించాడు. పైగా.. నర్సుపై కఠిన చర్యలు తీసుకోకూడదని అధికారులకు విజ్ఞప్తి చేయడం గమనార్హం.