రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ తో రూటు మార్చిన సీఎం

రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ తో రూటు మార్చిన సీఎం
  • మొన్న కమ్యూనిస్టులతో.. గత నెలలో స్టాలిన్​తో భేటీ
  • రాష్ట్రంపై బీజేపీ ఫోకస్​తో రూటు మార్చిన సీఎం
  • ఇటీవల రాష్ట్రానికి వరుసకట్టిన బీజేపీ టాప్​ లీడర్లు
  • టీఆర్​ఎస్​పై గట్టిగ కొట్లాడాలని కేడర్​కు పిలుపు

హైదరాబాద్​, వెలుగు: సీఎం కేసీఆర్​ జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలకు దగ్గరయ్యే పనిలో నిమగ్నమయ్యారు. ఇతర రాష్ట్రాల నేతలతోనూ రాజకీయ దోస్తీకి ప్రయత్నిస్తున్నారు. ఆర్జేడీ చీఫ్​ లాలూ ప్రసాద్​ యాదవ్​ కొడుకు, బీహార్​ అపొజిషన్​ లీడర్​ తేజస్వీ ప్రసాద్​ యాదవ్​ మంగళవారం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా ఆర్జేడీ లీడర్లు పాట్నా నుంచి వచ్చి ప్రగతి భవన్​లో సమావేశమవడం ఆసక్తి రేపుతున్నది. కేసీఆర్​ను తేజస్వీ యాదవ్​తో పాటు బీహార్​ మాజీ మంత్రి అబ్దుల్​ బారి సిద్ధిఖీ, మాజీ ఎమ్మెల్యేలు సునీల్​ సింగ్​, భోలా యాదవ్​ మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. భేటీకి గల కారణాలేమీ వెల్లడించలేదు. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న టైం కావటంతో ఈ సమావేశంలో రాజకీయ సమాలోచనలు జరిగి ఉండొచ్చన్న చర్చకు తెరలేచింది. ఇంతకీ ఆర్జేడీ లీడర్లే కేసీఆర్​ను కలిసేందుకు వచ్చారా..? లేక, కేసీఆరే ప్రత్యేకంగా వారిని  పిలిపించుకున్నారా..? అనే విషయంలో టీఆర్​ఎస్​ లీడర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఫోకస్​ పెంచిన బీజేపీ

ఇటీవల రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్​ పెట్టింది. స్వయంగా ప్రధాని మోడీ.. తెలంగాణలో ఏం జరుగుతున్నదని తెలుసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతలందరినీ ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్​కు వచ్చి టీఆర్​ఎస్​ టార్గెట్​గా విరుచుకుపడి, ఇక్కడి లీడర్లను సమాయత్తం చేశారు. ‘‘స్వయంగా నేనే హైదరాబాద్​ వచ్చి నిరసన ర్యాలీలో జాయిన్​ అయ్యి, కేసీఆర్​కు వ్యతిరేకంగా ప్రెస్​ కాన్ఫరెన్స్​లో స్ట్రాంగ్​గా మాట్లాడానంటే ఎందుకో అర్థం చేసుకోండి. టీఆర్​ఎస్​ సర్కారుపై బీజేపీ జాతీయ నాయకత్వం పాలసీ ఎలా ఉందో మీరు గుర్తించాలి. గట్టిగా పోరాడాలి.. తగ్గేదే లేదు” అంటూ బీజేపీ రాష్ట్ర నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. 

ఇదే వరుసలో బీజేపీకి చెందిన సీఎంలు శివరాజ్​సింగ్​ చౌహాన్​, హిమంత్​ బిశ్వ శర్మ, మాజీ సీఎం రమణ్​సింగ్​ రాష్ట్రానికి వచ్చి కేసీఆర్ చర్యలను ఎండగట్టడం పొలిటికల్​ హీట్ ను​ పెంచింది. దీంతో తమను బీజేపీ ఇరుకున పెడుతుందనే ధోరణి టీఆర్ఎస్​లో కనిపిస్తున్నది. బీజేపీని ఏమన్నా అంటే  రాజకీయంగా దాడి చేస్తారని,  విమర్శిస్తే ఐటీ, ఈడీని ప్రయోగిస్తారంటూ కేసీఆర్​తో పాటు కేటీఆర్​ ఇటీవల పలుమార్లు ప్రెస్​మీట్లలో ప్రస్తావించారు. ఈసారి వానాకాలంలో రైతులు పండించిన వడ్లు కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒకదశలో చేతులెత్తేసింది. తప్పు తమది కానే కాదంటూ కేంద్రాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేసింది. అప్పటి నుంచి టీఆర్​ఎస్​, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం హోదాలో కేసీఆరే ధర్నాకు దిగటంతో.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​లోనే  ఘాటుగా స్పందించింది. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటున్న లీడర్లను కలిసేందుకు కేసీఆర్​ ప్రయారిటీ ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. 

గత నెల నుంచే దోస్తీ ప్రయత్నాలు

నిరుడు డిసెంబర్​లో తమిళనాడులోని శ్రీరంగంలో రంగనాథస్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వెళ్లిన కేసీఆర్​.. మరుసటి రోజు తమిళనాడు సీఎం స్టాలిన్ తో సమావేశమయ్యారు. గత వారం సీపీఐ, సీపీఎం జాతీయ స్థాయి లీడర్లు కలుసుకున్నారు. హైదరాబాద్​లో పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరయ్​ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులతో భేటీ అయ్యారు. అదే రోజు ఏఐవైఎఫ్​ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత బినయ్ విశ్వం, కేరళ మంత్రి రాజన్​ కూడా కేసీఆర్​ను కలిశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుస్తామని, అదే కోవలో కేసీఆర్​ను కలిసినట్లు సీపీఎం లీడర్లు మరుసటి రోజు మీడియాకు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆర్జేడీ లీడర్లతో సమావేశమయ్యారు. 2018 ఎన్నికల టైమ్​లోనే కేసీఆర్​.. జాతీయ స్థాయిలో ఫెడరల్​ ఫ్రంట్​ ఏర్పాటుకు  పావులు కదిపారు. బీజేపీ, కాంగ్రెస్​కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ, నవీన్​ పట్నాయక్​, కుమారస్వామిని కలిసి మంతనాలు జరిపారు. అవేవీ కొలిక్కి రాకపోవటంతో సైలెంటయ్యారు. కేసీఆర్​ ప్రయత్నాలు బెడిసికొట్టాయని నాడు జాతీయ స్థాయిలో చర్చ జరిగింది.  ఇప్పుడు బీజేపీ నుంచి రాజకీయంగా ఎదురుదాడి పెరగడం.. స్థానికంగా ప్రతికూలత వెంటాడుతుండటంతో కేసీఆర్ ఇతర పార్టీలతో మళ్లీ టచ్​లో ఉంటున్నారని సొంత పార్టీ లీడర్లే చెప్తున్నారు.