
న్యూఢిల్లీ: బిహార్ ఓటర్ లిస్టులో పెద్ద ఎత్తున విదేశీయుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈసీ రాష్ట్ర ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్వే చేపట్టింది. ఈ క్రమంలో అధికారులు.. బిహార్‌లో పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ పౌరుల పేర్లను ఓటర్ జాబితాలో గుర్తించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 1 తర్వాత నుంచి వాళ్లందరీ డాక్యుమెంట్లను పరిశీలించి అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని తెలిపాయి. సెప్టెంబర్ 30న తుది జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నాయి.
కాగా, అనర్హులు, విదేశీయుల పేర్లను జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వే ప్రారంభించినట్టు ఈసీ పేర్కొంది. ప్రతి ఓటరూ తమ సిటిజన్‌షిప్‌ను నిర్ధారించే ఆధారాలను చూపాలని తెలిపింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలు ముందు ఈ ప్రక్రియను చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, ఈసీ చర్యను కోర్టు సమర్థించింది.