గప్​చుప్​ అమ్ముకునే వ్యక్తిని కాల్చి చంపేసిన్రు

గప్​చుప్​ అమ్ముకునే వ్యక్తిని కాల్చి చంపేసిన్రు
  • కాశ్మీర్​లో టెర్రరిస్టుల దారుణం

శ్రీనగర్: కాశ్మీర్​లో టెర్రరిస్టులు రెచ్చిపోతున్నరు.. సామాన్యులను టార్గెట్​గా చేసుకుని కాల్పులు చేస్తున్నరు. శ్రీనగర్​లో తోపుడు బండిపై గప్‌చుప్‌ అమ్ముకునే బిహారీ వ్యక్తిని, పుల్వామాలో కార్పెంటర్​ పనిచేసే యూపీ వ్యక్తిని శనివారం కాల్చేసిన్రు. 2 వారాల్లో టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయిన వాళ్ల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఐదుగురు నాన్​ లోకల్స్, నాన్​ ముస్లింలే కావడంతో కాశ్మీరీ పండిట్ల కుటుంబాలు భయపడుతున్నాయి. పీఎం స్పెషల్​ ఎంప్లాయ్​మెంట్​ స్కీంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో గతంలో కాశ్మీర్​ నుంచి వలస వెళ్లిన కుటుంబాలు ఇటీవలే తిరిగొచ్చాయి. 

పుల్వామాలో ఎన్​కౌంటర్.. 
పుల్వామా జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు. శనివారం ఉదయం పాంపోర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా సైనికులపైకి టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఇందులో ఒకరు లష్కరే తాయిబా కమాండర్ ముస్తాక్ ఖాండేగా గుర్తించామన్నారు. 

ఇద్దరు సైనికుల మృతదేహాలు..
పూంచ్​– రాజౌరీ సెక్టార్​లోని నర్​ఖాస్ అటవీ ప్రాంతంలో గురువారం నుంచి కనిపించకుండాపోయిన ఒక జేసీవో, జవాను చనిపోయారని అధికారులు చెప్పారు. డెడ్​బాడీలను అడవిలో శనివారం గుర్తించినట్లు తెలిపారు. కాల్పుల తర్వాత వీళ్లిద్దరూ మిస్​ అయ్యారని, వాళ్ల కోసం బలగాలతో కూంబింగ్ నిర్వహించామన్నారు. ఈ ప్రాంతంలో సోమవారం నుంచి టెర్రరిస్టులు, సైనికుల మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నాయి.