
మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ కొండలు, నదులు, సహజ గుహల్లో గిరిజనులు నివసిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివాసం ఉండటంతో..వీరంతా ఇప్పటికీ వైద్య సేవలను పొందలేకపోతున్నారు. ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలకు దూరంగా ఉండటంతో రోగులను మంచం మీద సమీప ప్రాథమిక చికిత్స కేంద్రాలకు తీసుకొస్తారు. అటు మహారాష్ట్ర సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని గ్రామాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందడం లేదు. రోడ్డు సౌకర్యం, అటవీ ప్రాంతం సరిగా లేకపోవడంతో ప్రజలు పిహెచ్‌సికి వెళ్లేందుకు నడవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం గిరిజనల చెంతకు ఆరోగ్య సేవలను అందించేందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది.
గడ్చిరోలి జిల్లాలోని సుదూర గ్రామాలకు మహారాష్ట్ర ప్రభుత్వం బైక్ అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించింది. ఈ మోటారుసైకిల్ అంబులెన్స్‌లు రోగులు, గర్భిణీలు, శిశువులను మారుమూల ప్రాంతాల నుండి సమీప ప్రాథమిక లేదా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్తాయి. ఈ ప్రత్యేకమైన బైక్ అంబులెన్స్‌లకు రోగి సౌకర్యం కోసం సైడ్ క్యారేజ్‌ను అమర్చబడ్డాయి. అంతేకాకుండా అత్యవసర అవసరాలను తీర్చడానికి మందులు, ఫంక్షనల్ ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను అందుబాటులో ఉంటాయి.
గడ్చిరోలి జిల్లాలో నేటికీ 122 గ్రామాలు వర్షాకాలంలో కనెక్టివిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. అదే సమయంలో సరైన రోడ్లు లేకపోవడంతో రోగులను పీహెచ్సీలకు తరలించేందుకు గ్రామాల్లో బైక్ అంబులెన్స్లను ప్రారంభించినట్లు చెప్పారు. రోగుల కోసం స్ట్రెచర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. స్థానిక ఆశా వర్కర్లతో కలిసి బైక్ అంబులెన్స్లు పనిచేస్తాయన్నారు.