
కొమురం భీం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దహేగాం మండలం గిరివెళ్లి గ్రామంలో పరువు హత్య జరిగింది. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని 8 నెలల గర్భిణి అయిన కోడలిని గొడ్డలితో చంపాడు మామ. శనివారం (అక్టోబర్ 18) జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
గత ఏడాది శివార్ల శేఖర్, తలండి రాణి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం ఇష్టం లేని తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకుని తన ఇంట్లోనే కాపురం పెట్టాడు.
మొదట్లో వ్యతిరేకించినా.. మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారులే అనుకున్నారు నవ దంపతులు. అయితే ఏడాది గడుస్తున్నా తండ్రి మనసులో పరువు పోయిందనే భావన తగ్గలేదు. కులదురహంకారంతో రగిలిపోతున్న తండ్రి శివార్ల సత్తయ్య.. ఎవరూ లేని సమయం చూసి నిండు చూలాలిని చంపేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమంయలో కోడలు తలండి రాణి (23) ని గొడ్డలి తో నరికి హత్య చేశాడు.
ALSO READ : దారుణం.. చిన్న పిల్లలతో క్లాస్రూం క్లీన్ చేయించారు..
రాణి ఇటీవలే గర్భం దాల్చింది. పాపో బాబో పుడితే వారసులను చూసైనా మారుతారులే అనుకున్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ప్రేమించిన వాడి కోసం కన్న తల్లిదండ్రులను, బంధువులను వదిలి వచ్చిన ఆమె మనసును అర్థం చేసుకోలేని మామ.. కులం భావనతో కళ్లు మూసుకుపోయిన అహంకారంతో ఎనిమిది నెలల గర్భవతిని చంపేశాడు.
తలండి రాణి హత్య గురించి తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరువు హత్యగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు