ఎల్ బీ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ లోని భాగ్యలత బస్టాప్ వద్ద ఆదివారం హకీంపేట్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు (టీఎస్08యూబీ5496) బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో బస్సును కంట్రోల్ చేయలేకపోవడంతో అదుపు తప్పింది. మోటారు బైక్ , కారు (ఏపీ10ఏడీ1600) ను బస్సుతో ఢీకొట్టిన డ్రైవర్ ఆ తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్ మీదుగా ఎక్కించాడు.
ఈ ప్రమాదంలో మోటార్ బైక్ పై ఉన్న రామకృష్ణకు(33) తీవ్ర గాయాలయ్యాయి. బైకు, కారు ధ్వంసం అయ్యాయి. కారులో ఉన్న వారు క్షేమంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ వినోద్ నాయక్ మద్యం మత్తులో ఉన్నాడని గమనించిన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన రామకృష్ణను హయత్ నగర్ లోని అమ్మ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

