ముందు బైకర్.. వెనుక ఆర్టీసీ బస్సు డ్రైవర్..ఇద్దరి నిర్లక్ష్యానికి ఐటీ ఉద్యోగిని మృతి

ముందు బైకర్.. వెనుక ఆర్టీసీ బస్సు డ్రైవర్..ఇద్దరి నిర్లక్ష్యానికి ఐటీ ఉద్యోగిని మృతి
  • మియాపూర్ ​పరిధిలో ఘటన

మియాపూర్, వెలుగు: ముందు వెళ్తున్న బైకర్, వెనుకాలే వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి సాఫ్ట్​వేర్ ఉద్యోగిని చనిపోయింది. మియాపూర్ పరిధిలోని ఆర్సీపురంలోని అశోక్​నగర్​కు చెందిన బి. గోపిప్రియ(29) సాఫ్ట్​వేర్​ఉద్యోగిని. నిత్యం మదీనగూడలోని కల్ట్ ఫిట్నెస్​సెంటర్​లో యోగా సెషన్​కు వెళ్తోంది. గురువారం ఉదయం యోగా సెషన్​ముగిసిన తర్వాత  తన స్కూటీపై మియాపూర్​నుంచి చందానగర్​వైపు బయలుదేరింది. 

మదీనగూడ అర్చన హాస్పిటల్ ఎదురుగా ప్రధాన రహదారిపై ముందు వెళ్తున్న ఓ బైకర్ అకస్మాత్తుగా కుడి వైపు తిరగగా, అతడిని ఢీకొని గోపిప్రియ స్కూటీ నుంచి కిందపడిపోయింది. ఈ క్రమంలో వెనుకాలే వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయపడింది. బాధితురాలిన స్థానికులు సమీప హాస్పిటల్​కు తరలించగా, ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. తన బిడ్డ మృతికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్,  బైకర్​పై చర్యలు తీసుకోవాలని గోపిప్రియ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో మియాపూర్​పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సాయం చేయడానికి వెళ్లి.. 

గండిపేట: ఓఆర్ఆర్​పై కారు బ్రేక్ డౌన్ కావడంతో సహాయం చేయడానికి వెళ్లిన వ్యక్తి మరో ప్రమాదంలో​మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. ఔటర్‌‌‌‌‌‌‌‌ మీదుగా శంషాబాద్‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్తున్న ఓ కారు రాజేంద్రనగర్ సమీపంలోకి రాగానే రోడ్డుకు మధ్యలో ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయ్యింది. కారులోని బాధితులు వెంటనే రికవరీ వ్యాన్ కు ఫోన్ చేయగా, శంషాబాద్‌‌‌‌‌‌‌‌ వైపు నుంచి వచ్చిన రికవరీ వ్యాన్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌ శివకేశవ (23) రోడ్డు దాటి వచ్చి బ్రేక్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ అయిన కారు టైర్లు మారుస్తున్నాడు. 

ఈ క్రమంలో మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన టయోటా కారు బీభత్సం సృష్టించింది. టైర్ మారుస్తున్న డ్రైవర్ శివకేశవను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఆగిన మరో కారును ఢీకొనడంతో అందులోని మరొకరికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.