దిల్ సుఖ్ నగర్, వెలుగు: హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నందుకు చలాన్ వేశాడని ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై బైకర్ దాడి చేశారు. సరూర్ నగర్ పరిధిలోని కొత్తపేట హుడా జంక్షన్ వద్ద ఈ నెల 26న ట్రాఫిక్ ఎస్సై కృష్ణయ్య, ఏఎస్సై రాయుడు, కానిస్టేబుల్ సత్యనారాయణ, అప్పారావు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. భరత్ అనే వ్యక్తి హెల్మెట్ లేకుండా ఎలక్ట్రిక్ బైక్ పై వస్తుండగా పోలీసులు ఆపారు.
చలాన్ జారీ చేస్తుండగా కానిస్టేబుల్ అప్పారావుతో భరత్ గొడవపడి బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. 15 నిమిషాల తర్వాత తిరిగి అక్కడికి వచ్చి రాయితో అప్పారావుపై దాడి చేసి, ట్యాబ్ ను ధ్వంసం చేశాడు. దాడిలో అప్పారావు ఎడమ కంటికి గాయమై రక్తస్రావం కావడంతో సమీపంలోని ఓమ్ని దవాఖానకు తరలించారు. సరూర్ నగర్ పోలీసులు భరత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
