- ఒక్కో గ్రామంలో 140 నుంచి 145 కిలోవాట్స్ సామర్థ్యం
- రోజుకు 800 యూనిట్ల సోలార్విద్యుత్ఉత్పత్తి అంచనా
- ఇప్పటికే డీపీఆర్ రూపొందించిన రెడ్కో అధికారులు
కామారెడ్డి, వెలుగు : సౌరశక్తి వినియోగంపై పల్లె ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ముందుగా ఒక్కో జిల్లాలో 5 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామాన్ని ఎంపిక చేసి సోలార్ వెలుగులు అందించాలని నిర్ణయించింది. ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన మోడల్ సోలార్ విలేజీ’ పథకంలో భాగంగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీ భవనాలు, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్, లైబ్రరీ, హాస్టల్స్, మహిళా సమాఖ్య బిల్డింగ్‌ల వంటి వాటిపై సోలార్ ప్యానల్ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎంపికైన మోడల్ గ్రామాల్లో విద్యుత్ ఉత్పత్తి ఎంతమేర కానుంది, అందుకు అయ్యే ఖర్చు ఎంత.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను రెడ్కో అధికారులు సిద్ధం చేశారు.
సోలార్ వినియోగం పెరిగేలా..
ప్రతి పల్లెలో సోలార్ విద్యుత్‌ను వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కార్ చర్యలు చేపట్టింది. ఒక్కో జిల్లాలో అధికంగా విద్యుత్ వినియోగించే 5 వేల జనాభా ఉన్న గ్రామాన్ని ఎంపిక చేసి, మిగతా విలేజీలకు మోడల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా సోలార్ ప్యానల్ ఏర్పాటుకు ఏఏ గ్రామాలు అనువుగా ఉన్నాయో సర్వే చేసి జిల్లా లెవల్ కమిటీ మోడల్ విలేజీని ఎంపిక చేశారు.
కామారెడ్డి జిల్లాలో 18 గ్రామాలను పరిశీలించి, భిక్కనూరు మండల కేంద్రాన్ని, నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాలను పరిశీలించి కోటగిరి మండల కేంద్రాన్ని అధికారులు ఎంపిక చేశారు. భిక్కనూరులో 29 బిల్డింగ్లు, కోటగిరిలో 31 బిల్డింగ్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో చోట 140 నుంచి 145 కిలో వాట్స్ కెపాసిటీ ఉన్న సోలార్ ప్యానల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మోడల్ విలేజీలో ప్రతి రోజు 800 యూనిట్ల వరకు సోలార్విద్యుత్ ఉత్పత్తి కానుండగా, రూ.కోటి వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
డీపీఆర్ సిద్ధం చేసిన అధికారులు మరోసారి డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ ఆమోదించిన తర్వాత ఉన్నతాధికారులకు రిపోర్టు పంపించనున్నారు. సోలార్ ఏర్పాటుకు 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టనుంది. సోలార్ విద్యుత్ వినియోగాన్ని మిగతా గ్రామాల ప్రజలు గమనించి తమ ఇండ్లల్లో సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.
భిక్కనూరులో గుర్తించిన భవనాలు..
ప్రైమరీ స్కూల్స్ 5, హైస్కూల్స్ 2, పంచాయతీ బిల్డింగ్, మండల పరిషత్, తహసీల్దార్ ఆఫీస్, పోలిస్ స్టేషన్, ఆరోగ్య శాఖ బిల్డింగ్లు 3, అంగన్వాడీలు 2, హాస్టల్స్ 2, ఎంఈవో ఆఫీస్, జూనియర్ కాలేజీ, వీక్లీ మార్కెట్ ఏరియా బిల్డింగ్, మహిళా సమాఖ్య భవనం, లైబ్రరీ, వాటర్ వర్క్స్, స్ర్టీట్ లైటింగ్ మీటర్లు ఉన్నాయి.
పర్మిషన్ రాగానే పనులు ప్రారంభిస్తాం..
ఉమ్మడి జిల్లాలోని భిక్కనూరు, కోటగిరి గ్రామాల్లో డీపీర్ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. అక్కడి నుంచి పర్మిషన్రాగానే ఎంపికైన గ్రామాల్లోని భవనాలపై సోలార్ సిస్టం ఏర్పాటు పనులను ప్రారంభిస్తాం. మోడల్ విలేజీల్లో సోలార్‌ను సక్సెస్ చేసి, మిగతా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తాం. - రమణ , రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్
