‘బిల్కిస్ బానో’ కేసు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

‘బిల్కిస్ బానో’ కేసు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
  • గుజరాత్ ​సర్కారుకు కూడా..  

న్యూఢిల్లీ: తనపై గ్యాంగ్ రేప్, కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఈ కేసులో కేంద్రంతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 11 మందిని దోషులుగా నిర్ధారించి 2008లో వారికి యావజ్జీవ శిక్ష వేసింది. గుజరాత్‌‌లోని పంచమహల్ జిల్లాలో గోద్రా సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆ ఖైదీలను ఆగస్టు 15, 2022న గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ కింద ముందస్తుగానే విడుదల చేసింది. ఈ విషయం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. దోషుల విడుదలను సవాలు చేస్తూ  బిల్కిస్ బానో పిటిషన్​దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై విచారించిన సుప్రీం కోర్టు.. దోషులను ఎందుకు ముందుగానే విడుదల చేశారో పూర్తి వివరాలతో వచ్చే విచారణ తేదీ నాటికి రెడీగా ఉండాలని గుజరాత్ సర్కారును ఆదేశించింది.

ప్రభుత్వ కార్యక్రమంలో బిల్కిస్ బానో అత్యాచార దోషి

‘బిల్కిస్ బానో’ కేసు దోషులలో ఒకరైన శైలేశ్ చిమ్నాలాల్ భట్ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో స్టేజీపై కనిపించాడు. ఈ నెల 25న జరిగిన ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాహోద్​జిల్లా కర్మాడీ విలేజ్​లో శనివారం కడన డ్యామ్ బల్క్ పైప్‌‌లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ జస్వంత్ సిన్హ్ భభోర్, అతడి సోదరుడు, స్థానిక ఎమ్మెల్యే శైలేశ్ భభోర్‌‌ హాజరయ్యారు. వారితో పాటు చిమ్నాలాల్ భట్ కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్​ ఫొటోలను ఎమ్మెల్యే భభోర్ తన ట్విట్టర్​లో షేర్ చేశారు.