పెళ్లి బంధాన్ని తెంచుకుంటున్న బిల్‌‌గేట్స్ దంపతులు

V6 Velugu Posted on May 04, 2021

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ దంపతులు విడిపోనున్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌‌గేట్స్ ఆయన భార్య మెలిందా విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లయిన 27 ఏళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకోనుండటం గమనార్హం. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా ఆయన భార్య మెలిందా వయసు 56 ఏళ్లు. లేటు వయసులో వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని బిల్‌‌గేట్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘మా వైవాహిక బంధం గురించి ఎన్నో సమాలోచనలు జరిపాక మేం ఓ నిర్ణయానికి వచ్చాం. ఈ పెళ్లి బంధాన్ని ముగించాలనుకుంటున్నాం. ఇన్నేళ్ల అనుబంధంలో ముగ్గురు అద్భుతమైన పిల్లల్ని తీర్చిదిద్దాం. దీంతోపాటు మా ఫౌండేషన్‌ను ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా కృషి చేశాం. ఇకపై ఫాండేషన్ పనుల్లో కలసికట్టుగా పని చేస్తాం. కానీ భార్యాభర్తలుగా కలిసుండలేం. కొత్త జీవితాలను ప్రారంభించనున్నాం’ అని గేట్స్ ట్వీట్ చేశారు. ఇకపోతే.. బిల్‌‌గేట్స్ దంపతులు విడిపోతున్నప్పటికీ బిల్‌‌మెలిందాగేట్స్ ఫౌండేషన్‌లో వారిద్దరూ ట్రస్టీలుగా, కో చైర్స్‌‌గా కొనసాగుతారని ఆ ఫౌండేషన్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. 

 

Tagged marriage, Divorce, Bill Gates, Melinda Gates

Latest Videos

Subscribe Now

More News