భగీరథ నీళ్లకు బిల్లులు

భగీరథ నీళ్లకు బిల్లులు
  • మార్చి నెల కావడంతో జోరుగా వసూళ్లు
  • చాలా జిల్లాల్లో కొత్త కనెక్షన్లకూ బాదుడు
  • ఒక్కో చోట ఒక్కో రేటు.. కొన్ని చోట్ల ఫ్రీ

మిషన్ ​భగీరథ కింద రాష్ట్రమంతా ఉచితంగా తాగునీళ్లు అందజేస్తున్నామని సీఎం కేసీఆర్ ​సహా రాష్ట్ర మంత్రులు  చెప్తున్నా.. చాలా జిల్లాల్లో ఫ్రీగా ఇవ్వడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు నెల కావడంతో ప్రస్తుతం పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఏడాదికి సంబంధించిన నల్లా బిల్లులు వసూలు చేస్తున్నారు. నీటి పన్ను వసూలు చేయొద్దని తమకు ఎలాంటి ఆర్డర్​ రాలేదని లోకల్​ బాడీల ఆఫీసర్లు  చెప్తున్నారు. కొందరేమో తమ ఏరియాలో మిషన్​ భగీరథ వాటర్​ ఇంకా రావట్లేదని, పాత స్కీములు అమలవుతున్నందునే ఎప్పట్లాగే బిల్లులు వసూలు చేస్తున్నామని అంటున్నారు. నెలాఖరు కల్లా బిల్లు కట్టకుంటే కనెక్షన్ కట్​ చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

నాగర్​కర్నూల్ / నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా లోకల్​బాడీస్​ ఆధ్వర్యంలో మార్చి 1 నుంచి ఇంటి పన్నుతో కలిపి నల్లా బిల్లులు జోరుగా వసూలు చేస్తున్నారు. ఈ నెల 31లోగా పన్నులు చెల్లించకపోతే వాటర్​ కనెక్షన్​ కట్​ చేస్తామని హెచ్చరిస్తున్నారు. చాలా పంచాయతీల్లో నెలకు రూ. 50 నుంచి రూ.70 చొప్పున, మున్సిపాలిటీల్లో రూ.100 నుంచి రూ. 200 వరకు వాటర్​ టాక్స్​ వేస్తున్నారు. ఇన్నాళ్లూ ఫ్రీగా వాటర్ ​ఇస్తున్నారని కట్టని జనం.. ఇప్పుడు ఏడాదికి సంబంధించి రూ. 600 నుంచి రూ. 2 వేలకు పైగా వచ్చిన బిల్లులు చూసి పరేషాన్​ అవుతున్నారు. ఇదేంటని అడిగితే ఆఫీసర్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమాధానం చెప్తున్నారు. వాటర్​ టాక్స్​ వసూలు చేయొద్దని  సర్కారు నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కొందరు చెబుతుండగా..  టాక్స్ వసూలు చేయాలా, వద్దా అనేది లోకల్​బాడీస్​ ఇష్టమని, జీపీలో,  మున్సిపల్​ కౌన్సిల్​లో తీర్మానం చేసుకుంటే సరిపోతుందని ఇంకొందరు అంటున్నారు. తమకు ఇంకా మిషన్​ భగీరథ వాటర్ రావట్లేదని, పాత స్కీముల కిందే నీళ్లు ఇస్తున్నందున టాక్స్​ వసూలు చేస్తున్నామని మరికొందరు ఆఫీసర్లు చెప్తున్నారు. అంటే మెజారిటీ గ్రామాలు, పట్టణాలు, కార్పొరేషన్లలో మిషన్​ భగీరథ నీళ్లు రావట్లేదని అర్థమవుతున్నది. దీంతో మిషన్​భగీరథ వాటర్​ రాని లోకల్​ బాడీస్​ పరిధిలోని జనం  అటు సేఫ్టీ వాటర్​ దొరకక, ఇటు నల్లా బిల్లులు కడ్తూ రెండు విధాలా లాస్​ అవుతున్నారు.  

ఒక్కో జిల్లాలో ఒక్కో లెక్క.. 
మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి లాంటి జిల్లాల్లో మిషన్​ భగీరథ నీళ్లు వస్తున్న గ్రామాల్లో టాక్స్ వసూలు చేయడం లేదు. పాత ఆర్​డబ్ల్యూఎస్​ స్కీంల ద్వారా, పంచాయతీ బోర్ల ద్వారా వాటర్ సప్లయ్​ చేస్తున్న గ్రామాల్లో మాత్రం ఏడాదికి రూ.600 చొప్పున వసూలు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో మాత్రం మిషన్​భగీరథ వాటర్​ వస్తున్న గ్రామాలు, మున్సిపాలిటీల్లోనూ వాటర్​టాక్స్​ వేస్తున్నారు. నాగర్​కర్నూల్​ జిల్లాలో ఇటీవల మిషన్​భగీరథ ఆఫీసర్లు  జోక్యం చేసుకొని ఏఈలు, డీఈల ద్వారా వాటర్​ టాక్స్​ వసూలు చేయరాదని పంచాయతీలకు చెప్పించారు. కానీ ఎవరూ 
లెక్కచేయడం లేదు. 

ఈ జిల్లాలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఏడాదికి రూ. 360 నుంచి రూ. 1,200 దాకా నల్లా బిల్లులు కట్టించుకుంటున్నారు. ఇంటి ట్యాక్స్​ఏడాదికి రూ. 180 ఉంటే వాటర్​ బిల్లు రూ. 360 వసూలు చేయడం ఎక్కడి న్యాయమని ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రశ్నిస్తున్నా వినేవారు లేరు. ఈ జిల్లాలో బీపీఎల్​ ఫ్యామిలీలను, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉంటున్నవాళ్లనూ వదిలిపెట్టడం లేదు. ఈ వాటర్​ ట్యాక్స్​ కూడా అన్నిచోట్ల ఒకే మాదిరి ఉండడం లేదు. ఉదాహరణకు రామగుండం కార్పొరేషన్​ పరిధిలో నెలకు రూ.100 చొప్పున వసూలు చేస్తుండగా, మెదక్​ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇంత తేడా ఎందుకో అర్థం కాని పరిస్థితి.  ఇక వరంగల్​ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏడాదికి రూ. 600 చొప్పున నల్లా పన్ను వసూలు చేస్తున్నారు. పర్వతగిరి, నెక్కొండలాంటి మండలాల్లో 100శాతం మిషన్​భగీరథ వాటర్​ వస్తున్నా ఎప్పట్లాగే నల్లా బిల్లులు వసూలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో నెలకు రూ. 100 చొప్పున, ఇల్లెందు మున్సిపాలిటీలో రూ. 150 చొప్పున, ఇదే జిల్లాలోని  మణుగూరు మున్సిపాలిటీలో 200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా కొన్నిచోట్ల ఫ్రీగా, కొన్ని చోట్ల ఇష్టమొచ్చిన రేట్లు వసూలు చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. నల్లా నీళ్లకు పన్ను వసూలు చేసే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, ఇస్తే అందరికీ ఉచితంగా లేదంటే ఏదో ఒక రేటు ఫిక్స్​ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫ్రీ లేదు.. ఏం లేదు.. 
మిషన్​భగీరథ కింద ప్రతి ఇంటికి ఫ్రీగా నీళ్లు ఇస్తున్నామని సీఎం కేసీఆర్​ చెబుతున్నరు. కానీ లోకల్​ ఆఫీసర్లు వాటర్​ బిల్లులు వసూలు చేస్తున్నరు. మా ఊరిలో ఏడాదికి రూ.360 కట్టించుకుంటున్నరు. మూడేండ్ల సంది బిల్లులు కడ్తనే ఉన్న. ఇదేందని అడిగితే ఊరికోసమే కదా కడ్తే ఏమైతంది అంటున్నరు. మాబోటోళ్లకు పైస పైస గండమే కదా? పేదోళ్లకు సర్కారు మాఫీ చేయాలె.  - గుడ్లనర్వ కృష్ణయ్య , మహాదేవునిపేట,  బిజినేపల్లి మండలం

బిల్లు కట్టకపోతే వాటర్ కట్ చేస్తమంటున్నరు 
ప్రభుత్వం ఇంటింటికీ  ఫ్రీగా మిషన్ భగీరథ నీళ్లు ఇస్తమని చెప్పింది. కానీ మా సూర్యాపేట మున్సిపాలిటీ సిబ్బంది నల్లా బిల్లు కింద ఏడాదికి రూ.1,200 కట్టించుకుంటు న్నరు. నల్లా బిల్లు కట్టకుంటే కనెక్షన్​ కట్ చేస్తమని బెదిరిస్తున్నరు. పైసలు తీసుకుంటున్నరుగని  రిపేర్లు వచ్చినప్పు డు పత్తా ఉంటలేరు. కాలనీలకు కొన్ని సార్లు రోజుల కొద్దీ నీళ్లు రావు. 
‑ అరూరి శివ, సూర్యాపేట మున్సిపాలిటీ

భగీరథ నీళ్లకు ట్యాక్స్​ఉంటది
ప్రభుత్వ ఆదేశాలు, మంత్రి కేటీఆర్ సూచన మేరకు రామగుండం కార్పొరేషన్​ పరిధిలో రూపాయికి నల్లా కనెక్షన్ ఇస్తున్నం. కానీ మా దగ్గర భగీరథ పైప్​లైన్​ పనులు వంద శాతం పూర్తి కాలేదు. ఒకవేళ పూర్తియినా వాటర్ సప్లయ్ చార్జెస్ ప్రభుత్వం నిర్ణయించదు. ఆయా మున్సిపాలిటీలే తీర్మానాల ద్వారా ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తయ్​.  ప్రస్తుతం రామగుండంలో రూ. 100 చొప్పున వసూలు చేస్తున్నం.  భగీరథ లైన్స్ పూర్తయ్యాక మరోసారి మున్సిపాలిటీలో తీర్మానం చేసి కనీస చార్జీలు నిర్ణయిస్తం.
- సుమన్​రావు, మున్సిపల్ కార్పొరేషన్​ కమిషనర్​, రామగుండం