
ఏజెన్సీలో అతిపెద్ద పరిశ్రమ… దశాబ్ధాలుగా లాభాల్లో నడిచింది. ప్రత్యక్షంగా.. పరోక్షంగా వేల కుటుంబాలకు జీవనాధారంగా నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాలుగేళ్ళ క్రితం మూతపడింది బిల్ట్ పరిశ్రమ. దాన్ని తెరవాలని కార్మికులు 415 రోజులుగా చేసిన దీక్షలు ఇప్పుడు ఫలించబోతున్నాయి. పరిశ్రమ పునరుద్దరణకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా… ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం. ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ 1975లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రేయాన్స్ పరిశ్రమ ఏర్పాటైంది. 1980లో ఉత్పత్తి మొదలైంది. తర్వాత ఈ పరిశ్రమను బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. 610 ఎకరాల్లో నెలకొల్పిన ఈ పరిశ్రమలో ఏడాదికి 90 వేల టన్నుల కాగితపు గుజ్జు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కలప నుంచి అనేక ప్రక్రియల తర్వాత కాగితపు గుజ్జుగా మారుస్తారు. పల్పిని మార్కెట్ అసరాలకు అనుగుణంగా ఎగుమతి చేసేందుకు షీట్స్ గా మారుస్తారు. ఈ పరిశ్రమలో ఒకప్పుడు వేయి మంది వరకూ పర్మినెంట్, 20వేల మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేశారు. మరో 6వేల మంది పరోక్షంగా ఉపాధి పొందారు.
బిల్ట్ పరిశ్రమలో ఉత్పత్తి అయిన కాగితపు గుజ్జును గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేస్తుండేది. ఆ తర్వాత ఈ కంపెనీ సొంతంగా పరిశ్రమను నెలకొల్పింది. దీంతో 2014 ఏప్రిల్ లో బిల్ట్ కాగితపు గుజ్జు కొనుగోలును నిలిపివేసింది. దీనికి తోడు పల్ప్ కు మార్కెట్ లేక నష్టాలు వస్తున్నాయని యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేసి.. పరిశ్రమను మూసేసింది. 2014 ఏప్రిల్ 6న కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాంతో ఈ పరిశ్రమపై ఆధారపడ్డ ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి కరువైంది. ఆ తర్వాత యంత్రాలు కూడా తుప్పుబట్టి…ఎందుకూ పనికిరాకుండా పోయాయి.
కమలాపూర్ లో ఉన్న ఈ బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాగితపు గుజ్జు పరిశ్రమలో స్థానికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు. ఏటూరునాగారం ఏజెన్సీలో విద్యావంతులు లేకపోవడం, టెక్నికల్ సామర్థ్యం కూడా లేకపోవడంతో… ఉమ్మడి ఏపీలోని శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన వారు బిల్ట్ లో ఉద్యోగాలు సంపాదించారు. 30యేళ్ళుగా ఏపీకి చెందిన వారు చాలామంది స్థిరపడటంతో మారుమూల ప్రాంతమైన కమలాపూర్ అబివృద్ది చెందింది. ఆ తర్వాత స్థానికులకు పర్మినెంట్ జాబ్స్ లభించినా.. ఎక్కువ మంది పీఎఫ్ కార్మికులుగానే ఉపాధి పొందారు. పరిశ్రమ ప్రారంభించే నాటికి 300 మంది పర్మినెంట్ కార్మికులు మాత్రమే ఉండగా… ఆ తర్వాత పర్మినెంట్, టెంపరరీ, డైలీవైజ్ కార్మికులు… నాలుగు షిప్టుల్లో 3వేల మంది పనిచేశారు. బిల్ట్ పరిశ్రమ నడిచిన కాలమంతా కార్మికులకు స్వర్ణయుగమే. కార్మికులకు వైద్యంతో పాటు వారి పిల్లల చదువుకి అన్ని సౌకర్యాలు కల్పించింది యాజమాన్యం. 2014లో ఫ్యాక్టరీ మూతపడ్డ ఏడాది వరకూ జీతాలు చెల్లించిన యాజమాన్యం.. ఆ తర్వాత నిలిపేయడంతో కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. కనీసం కుటుంబం గడవటం కూడా కష్టంగా మారింది. 33 నెలలకుగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు కార్మికులు. అనారోగ్యంతో సరైన వైద్యం అందక ఇప్పటి వరకూ 12 మంది కార్మికులు చనిపోయారు.
బిల్ట్ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి 2015 మార్చి 9 నుంచి 2016 మార్చి 6వరకూ 362 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశారు కార్మికులు. అందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బిల్ట్ పరిశ్రమని తిరిగి ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ఏడాదికి 30 కోట్ల చొప్పున ఏడేళ్లకు 210 కోట్ల రూపాయల రాయితీ ప్రకటించింది. 2016 మార్చి 6న ప్రత్యేక జీవో కూడా రిలీజ్ చేసింది. సబ్సిడీపై ముడి కలప, కరెంటు, నిరంతర బొగ్గు సరఫరాకి హామీ ఇచ్చింది. బిల్ట్ పునరుద్ధరణకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి ఏళ్లు గడిచినా ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకులేదు. అటు కార్మిక జేఏసీ-యాజమాన్యం మధ్య కూడా చాలాసార్లు చర్చలు జరిగాయి. ప్రభుత్వం రాయితీలు ఇచ్చి యాజమాన్యంతో చర్చలు జరిపిందని ఎంపీ సీతారామ్ నాయక్ తెలిపారు.
ఈమధ్యే మరోసారి సికింద్రాబాద్ బిల్ట్ ఆఫీసులో కార్మిక జేఏసీ-యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్ కి కార్మికులు కూడా కొంతవరకూ తమ అలవెన్సులు తగ్గించుకోవాలని యాజమాన్యం సూచించగా, కార్మిక జేఏసీ నాయకులు అందుకు ఒప్పుకున్నారు. అంగీకార పత్రాలపై సంతకాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. కార్మికుల బేసిక్ సాలరీ, డీఏ యధాతథంగా ఉంటుందనీ.. ఫ్యాక్టరీకి మళ్లీ భవిష్యత్ ఉండాలని, కొన్ని అలెవెన్సుల్ని కొంత వరకూ తగ్గించుకున్నామని కార్మిక జేఏసీ నేతలు చెబుతున్నారు. త్వరలో బ్యాంకర్లు-యాజమాన్యం మధ్య చర్చలు జరుగుతాయనీ…ఆ తర్వాత ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులు ప్రారంభమవుతాయని జేఏసీ నాయకులు చెబుతున్నారు. అందుకే 415 రోజులుగా చేస్తున్న దీక్షలు విరమించినట్టు తెలిపారు.
బిల్ట్ పరిశ్రమ తెరిపించేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నామనీ….పార్లమెంట్ లో ప్రస్తావించడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసామని మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్ చెబుతున్నారు. యాజమాన్యం ముందుకురావడాన్ని స్వాగతిస్తున్నామనీ… ఒప్పందాలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుందని చెప్పారు ఎంపీ.
ప్రభుత్వం ఫ్యాక్టరీ పునరుద్దరణకు గతంలోనే రాయితీల జీవో జారీ చేయడం, తాజాగా కార్మిక జేఏసీ-యాజమాన్యం మధ్య చర్చలు సఫలం అవడంతో కార్మికుల్లో బిల్ట్ పునరుద్దరణపై ఆశలు చిగురిస్తున్నాయి. తమకు తిరిగి ఉపాధి కలుగుతుందని వాళ్ళు సంతోషంగా ఉన్నారు.