హాకీ ఆసియా కప్-2025 విజేతగా భారత్.. 8 ఏండ్ల తర్వాత టైటిల్ కైవసం

హాకీ ఆసియా కప్-2025 విజేతగా భారత్.. 8 ఏండ్ల తర్వాత టైటిల్ కైవసం

న్యూఢిల్లీ: హాకీ ఆసియా కప్-2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను చిత్తు చేసి టోర్నీ విజేతగా అవతరించింది ఇండియా. తద్వారా 8 ఏండ్ల తర్వాత ఆసియా కప్ టైటిల్‎ను కైవసం చేసుకున్న భారత్.. 2026 హాకీ వరల్డ్ కప్‎కు నేరుగా అర్హత సాధించింది. ఓవరాల్‎గా ఇండియా నాల్గవసారి ఆసియా కప్‌ను గెలుచుకుంది. 

ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌‎లో అప్రతిహత జైత్రయాత్ర కొనసాగించిన భారత్ ఫైనల్ పోరులోనూ అదే ఆట తీరు కనబర్చించింది. ఆదివారం (సెప్టెంబర్ 7) రాజ్‌గిర్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో 4-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను చిత్తు చేసింది. ఇండియా దూకుడుతో ఫైనల్ పోరు ఏకపక్షమైంది. హాకీలో అత్యంత విజయవంతమైన జట్టైన కొరియాపై ఫైనల్ పోరులో ఇండియా అధిపత్యం చెలాయించింది.

స్టార్టింగ్ నుంచే ఎటాకింగ్ గేమ్‎తో ప్రత్యర్ధిని డిఫెన్స్‎లో పడేసింది మెన్ ఇన్ బ్లూ. పదే పదే దక్షిణ కొరియా గోల్ పోస్ట్‎పై దాడి చేసి డిఫెండింగ్ చాంపియన్ ను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ఆట ప్రారంభమైన నిమిషంలోనే సుఖ్జీత్ రివర్స్ హిట్‎తో అద్భుతమైన గోల్ సాధించడంతో ఇండియా గోల్స్ వేట మొదలుపెట్టింది. ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు నుంచి ప్రతిఘటన ఎదురైన భారత్ అదే పట్టుదల కనబర్చింది.

సరిగ్గా ఫస్ట్ ఆఫ్ ముగిసే ముందు 28వ నిమిషంలో దిల్ప్రీత్ గోల్ సాధించడంతో ఇండియా 2-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత 45వ నిమిషంలో దిల్‌ప్రీత్ మరో అద్భుతమైన షాట్ కొట్టి ఇండియాకు మూడో గోల్ అందించాడు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ అందించిన బంతిని దిల్ ప్రీత్ గోల్ గా మలిచాడు. ఇక, ఆట చివర్లో 50వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ ను అమిత్ రోహిదాస్ డ్రాగ్ ఫ్లిక్ తీసుకొని గోల్ సాధించాడు. దీంతో భారత్ 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ తరుణంలో కొరియన్ ప్లేయర్స్ ఎటాకింగ్ గేమ్ మొదలుపెట్టారు. 

కొరియన్ స్టార్ ప్లేయర్ సన్ డైన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి కొరియాకు తొలి గోల్ అందించాడు. కానీ అప్పటికే ఇండియా గెలుపు దాదాపు ఖాయం అయ్యింది. చివర్లో కొరియన్ టీమ్ ఎటాక్ ను నిలువరించి 4-1 తేడాతో సొంతగడ్డపై విజయం సాధించిన భారత్.. నాలుగోసారి ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. తద్వారా 2026 హాకీ ప్రపంచ కప్ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. దీంతో ఒక్క దెబ్బకే రెండు పిట్టలు  అన్నట్లుగా ఒక్క విజయంతో ఇండియాకు రెండు కలిసొచ్చాయి.