
హైదరాబాద్: హైదరాబాద్‌లో బంజారా హిల్స్ రిచెస్ట్ పీపుల్ నివసించే ఏరియాల్లో ఒకటి. సాధారణంగా ఇలాంటి ఏరియాలో దొంగతనం అంటే.. పెద్ద మొత్తంలో డబ్బులు, గోల్డ్, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తుంటారు దొంగలు. కానీ ఇటీవల బంజారాహిల్స్‌లో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఆటోలో వచ్చిన ఓ దొంగ.. రోడ్డు పక్కన తోపుడు బండ్లో ఉన్న కొబ్బరి బొండాలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. బంజారా హిల్స్‌లో విచిత్ర దొంగతనం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో రోడ్డు పక్కన తోపుడు బండ్లపై కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ కొందరు జీవనం సాగిస్తున్నారు. రాత్రి వేళ కొబ్బరి బొండాలను బండి పైనే ఉంచి పట్టా కప్పి ఇంటికి వెళ్తుంటారు. ఇది గమనించిన ఓ దొంగ.. అర్ధరాత్రి ఆటోలో వచ్చి కొబ్బరి బొండాలు చోరీ చేశాడు. తోపుడు బండిపై ఉన్న పట్టా తొలగించి కొబ్బరి బొండాలను ఆటోలో వేసుకుని పరార్ అయ్యాడు.
తెల్లారి వచ్చే వరకు కొబ్బరి బొండాలు మాయం కావడంతో షాక్ అయ్యారు దుకాణాదారులు. అసలేం జరిగిందో తెలుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దొంగ కొబ్బరి బొండాలు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఇలానే గతంలో కూడా రెండుసార్లు దొంగతనం జరిగినట్టు చెప్పారు దుకాణాదారులు. ఈ ఘటనపై దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
బంజారాహిల్స్ దొంగ కొబ్బరి బొండాల చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోజువారి కష్టంతో జీవనం సాగిస్తున్న పేదల పొట్ట కొట్టే విధంగా ఈ తరహా దొంగతనాలు జరగడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని కష్టజీవులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.