
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంధంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ, ట్రంప్ స్నేహితులు కావచ్చు.. కానీ మోడీ దేశానికి శత్రువుగా మారారని విమర్శించారు. ఇండియా, అమెరికా మధ్య సంబంధాలను మోడీ చెడగొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకోవాలని సూచించారు. ఇండియా ఫస్ట్.. ఆ తర్వాతే ట్రంప్, మోడీ ఫ్రెండ్ షిప్ అన్నారు.
అమెరికా సుంకాలు, జీఎస్టీ సంస్కరణలపై ఆదివారం (సెప్టెంబర్ 7) కలబురిగిలో మీడియాతో మాట్లాడారు ఖర్గే. మోడీ, ట్రంప్ ఒకరికొకరు ఓట్ల కోసం మంచిగా ఉండవచ్చు. కానీ వారిద్దరి పొత్తు వల్ల ఇండియా నష్టపోతుందన్నారు. ట్రంప్‌తో బహిరంగంగా పొత్తు పెట్టుకోవడం ద్వారా భారత అంతర్జాతీయ ఖ్యాతిని మోడీ దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో అమెరికా పర్యటనకు వెళ్లిన మోడీ.. ట్రంప్ నా ఫ్రెండ్.. మరోసారి ఆయనే అధికారంలోకి వస్తాడని చెప్పి్ ప్రపంచ దేశాల ముందు ఇండియా పరువు తీశాడని దుయ్యబట్టారు. అమెరికా విషయంలో దశాబ్దాలుగా ఇండియా తటస్థ, అలీన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోందని.. మోడీ సర్కార్ కూడా ఆ మార్గంలో నడిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదని అన్నారు.
సవరించిన జీఎస్‌టీ రేట్లపై ఖర్గే మాట్లాడుతూ.. పేదలకు ప్రయోజనం చేకూర్చే ఏ చర్యనైనా కాంగ్రెస్ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. జీఎస్టీ పేరుతో బీజేపీ సంవత్సరాలుగా ప్రజలను హింసిస్తోందని ఆరోపించారు. జీఎస్టీ సంస్కరణల గురించి మేం 8 సంవత్సరాల కిందే లేవనెత్తామని గుర్తు చేశారు.
జీఎస్టీలో రెండు శ్లాబులు ఉంటే పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అప్పుడే చెప్పామన్నారు. కానీ బీజేపీ నాలుగు శ్లాబుల ప్రవేశపెట్టి ప్రజలను దోచుకున్నారని ఫైర్ అయ్యారు. బీహార్ ఎన్నికలు దగ్గర పడటంతో బీజేపీ జీఎస్టీ శ్లాబులను సవరించిందని ఆరోపించారు.