వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డ్: ఇంగ్లాండ్‎పై 342 రన్స్ తేడాతో ఓడిన సౌతాఫ్రికా

వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డ్: ఇంగ్లాండ్‎పై 342 రన్స్ తేడాతో ఓడిన సౌతాఫ్రికా

బ్రిటన్: వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేసింది సౌతాఫ్రికా. ఇంగ్లాండ్‎పై 342 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై వన్డే క్రికెట్లోనే దారుణమైన రికార్డును మూటగట్టుకుంది. ఈ ఓటమితో గతంలో శ్రీలంకపై ఉన్న చెత్త రికార్డును సఫారీ జట్టు బ్రేక్ చేసింది. గతంలో శ్రీలంక 317 పరుగుల తేడాతో ఇండియాపై ఓటమి పాలైంది. ఇప్పటి వరకు వన్డే క్రికెట్లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. తాజాగా ఈ రికార్డ్‎ను సౌతాఫ్రికా బ్రేక్ చేసింది. 

342 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‎పై ఓడి వన్డే క్రికెట్లో పరుగుల పరంగా అతిపెద్ద ఓటమిని తమ పేరిట లిఖించుకుంది సఫారీ జట్టు. ఈ విజయంతో ఇండియా రికార్డును బ్రేక్ చేసింది ఇంగ్లాండ్. వన్డే క్రికెట్లో ఇప్పటి వరకు పరుగుల పరంగా (317) అతిపెద్ద విజయం సాధించిన రికార్డ్ ఇండియా పేరిట ఉండేది. తాజాగా సౌతాఫ్రికాపై 342 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ఇంగ్లాండ్.. వన్డే క్రికెట్లో రన్స్ పరంగా అతిపెద్ద విజయం సాధించిన జట్టుగా తమ పేరిట రికార్డ్ లిఖించుకుంది.

మూడు వన్డేల సిరీస్‎లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 7) సౌతాంప్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అతిథ్య ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

ఇంగ్లాండ్ బ్యాటర్లలో రూట్ (100), జాకబ్ బెథేల్ (110) సెంచరీలతో కదం తొక్కగా.. జేమీ స్మిత్ 62, డకెట్ 31 పరుగులతో రాణించారు. చివర్లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ (62), విల్ జాక్స్ (19) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ 414 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 415 పరుగుల భారీ చేధనకు దిగిన సౌతాఫ్రికా జట్టు కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 

భారీ చేధనలో సఫారీ జట్టు పూర్తిగా తేలిపోయింది. సౌతాఫ్రికాలో ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సపారీ బ్యాటర్లలో హాయొస్ట్ స్కోర్ 20 పరుగులు. ఇంగ్లాండ్ బౌలర్లు ఆర్చర్ 4, ఆదిల్ రషీద్ 3 వికెట్లతో సౌతాఫ్రికా పతానాన్ని శాసించారు. ఈ ఇద్దరి ధాటికి 415 పరుగుల చేధనలో సౌతాఫ్రికా కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయ్యి 342 రన్స్ తేడాతో వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డ్‎ను మూటగట్టుకుంది.