
- దశాబ్దంగా సేవలు పొందుతూ.. కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగించడం చెల్లదు: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: తాత్కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికపై పారా మెడికల్ సేవలందిస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని బీహెచ్‌ఈఎల్‌ను ఆదేశిస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. దశాబ్దానికిపైగా పిటిషనర్ల సేవలను పొందుతూ రెగ్యులరైజ్ చేయకుండా అలాగే కొనసాగించడం సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకమని తేల్చింది. వాళ్లను పర్మినెంట్ చేయకుండా తాత్కాలిక ఉద్యోగులుగానే కొనసాగించడం చెల్లదంది. పర్మినెంట్ చేయని బీహెచ్‌ఈఎల్‌ను తప్పుబట్టింది.
దొడ్డిదారినకాకుండా చట్టబద్ధంగా రూల్స్ మేరకు కాంట్రాక్ట్ పద్ధతిన నియమితులైన వారిని క్రమబద్ధీకరించాలంది. దీనికి సంబంధించి సుప్రీం కోర్టు ఉమాదేవి వర్సెస్ కర్నాటక కేసును ఉదహరించింది.. తాత్కాలిక పద్ధతిన నియమితులైనప్పటికీ వారి సర్వీసులను ఎప్పటికప్పుడు కొంత విరామం ఇస్తూ పొడిగిస్తూ వస్తున్నారని, అంటే వారి సేవలు అవసరమని తెలుస్తున్నదని, అందువల్ల పిటిషనర్లు శాశ్వత నియామకానికి అర్హులేనని, వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. పారామెడికల్ తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా నియామకం చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ జి.దుర్గాప్రసాద్ మరో 28 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ బీహెచ్‌ఈఎల్ పిటిషనర్లను తాత్కాలిక పద్ధతిన 2012–2016 మధ్య ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్, ఇంటర్నల్ సర్క్యులర్లు, క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఎంపిక చేశారన్నారు.
మొదట ఆరు నెలలకు సర్వీసు తీసుకున్నారని తరువాత వారం అలా కృత్రిమ విరామం ఇస్తూ తిరిగి నియామకం చేపడుతూ అనైతిక కార్మిక విధానానికి పాల్పడిందన్నారు. ఎప్పటికప్పుడు సర్వీసును పొడిగించడానికి అధికారులు సిఫారసులు చేస్తున్నారని, అంటే వారు అందిస్తున్న సేవల్లో ఎలాంటి లోపం లేదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
ఒప్పందం ప్రకారం వారికి ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, బోనస్, ఎస్‌ఐపీ తదితర చట్టబద్ధమైన ప్రయోజనాలతోపాటు రూ. 2లక్షల బీమా సౌకర్యం, వసతి సౌకర్యం కల్పించడానికి బీహెచ్‌ఈఎల్ అంగీకరించిందన్నారు. అయితే శాశ్వత నియమాకాలు చేపట్టడంలేదన్నారు.
బీహెచ్‌ఈఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి తాత్కాలిక పద్ధతిన పిటిషనర్ల నియామకం చేపట్టినట్లు తెలిపారు. అన్ని షరతులకు లోబడే సర్వీసులో చేరారని ఇప్పుడు ఇంజనీరింగ్ ఉద్యోగులతో సమానంగా క్రమబద్ధీకరించాలంటే సరికాదన్నారు.
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి దశాబ్దానికిపైగా వారి ఉద్యోగాల్లో ఉంటున్నారని, కార్మిక శాఖ అధికారులు సెటిల్‌మెంట్ చేసినప్పటికీ అమలుకాలేదన్నారు. తాత్కాలిక పద్ధతిన ఉద్యోగులను సుదీర్ఘకాలం కొనసాగించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. పిటిషనర్లు శాశ్వత ఉద్యోగులుగా నియామకానికి అర్హులని, వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా తీసుకుని, అన్ని వేతన ప్రయోజనాలను కల్పించాలని ఆదేశించారు.