కామారెడ్డిటౌన్, వెలుగు : ఇద్దరు అంతర్రాష్ర్ట దొంగలను అరెస్ట్ చేశామని, ఇదే ముఠాకు చెందిన ఒకరిని ఇదివరకే అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ఆఫీస్లో మీడియాకు ఎస్పీ వివరాలు వెల్లడించారు. జనవరి 2న అశోక్‌నగర్ కాలనీలోని ఇంట్లో చోరీ జరగగా, బాధితుడు మాలోతు బాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి టౌన్ పోలీసులు దర్యాప్తు చేశారని పేర్కొన్నారు. స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా అంతర్రాష్ర్ట ముఠా చిక్కిందని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన చిల్లకూరి కృష్ణారెడ్డి అలియాస్ చండీ కృష్ణను జనవరి 9న అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపామన్నారు.
పరారీలో ఉన్న ఇద్దరు జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్డులోని బైపాస్ వద్ద సోమవారం అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాలు ఒప్పుకున్నారన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన మూడావత్ అంజియా, మేడ్చల్ జిల్లా యాప్రాల్‌కు చెందిన సత్యనారాయణ లను అరెస్ట్ చేసినట్లు వివరించారు. సత్యనారాయణ దొంగల నుంచి సొత్తు కొనుగోలు చేస్తున్నారన్నారు.
వీరి నుంచి సెల్‌ఫోన్, 89 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కృష్ణారెడ్డి అలియాస్ చండీ కృష్ణ, మూడావత్ అంజియా మన స్టేట్‌లోని మెదక్, సిరిసిల్లా జిల్లాలు, హైదరాబాద్ తదితర ఏరియాలతో పాటు, ఒడిశాలో గతంలో చోరీలు చేశారని తెలిపారు. సీఐలు బి.నరహరి, ఎన్. శ్రీనివాస్, ఏఎస్సై రంగారావు, సిబ్బంది కమలాకర్, రాజు, సంపత్, మహేందర్, శ్రీనివాస్‌రావు, గణపతిలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, సీఐలు నరహరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
