మలయాళం క్రైమ్ సినిమాలను మించిన రియల్ స్టోరీ.. ట్విస్టుల మీద ట్విస్టులు.. చివరికి నిజమే గెలిచింది !

మలయాళం క్రైమ్ సినిమాలను మించిన రియల్ స్టోరీ.. ట్విస్టుల మీద ట్విస్టులు.. చివరికి నిజమే గెలిచింది !

మలయాళం క్రైమ్ సినిమాను మించిన ట్విస్ట్.. దొంగతనం కేసులో పని మనిషిని ఫిక్స్ చేసిన పోలీసులు.. ఈ విషయం బయటకు రావడంతో.. ఎస్ఐతో సహా పోలీస్ స్టేషన్లోని సిబ్బంది మొత్తంపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. బాధ్యులైన పోలీసులను కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఫేక్ కేసు నుంచి బయటపడిన బిందుకు ఒక స్కూల్లో ప్యూన్గా ఉద్యోగం వచ్చింది. బంగారం పోయిందని ఫిర్యాదు చేసిన ఇంటి యజమానితోనే పోలీసులు లాలూచీ పడి దళిత మహిళ అయిన పని మనిషి బిందుపై నేరం మోపిన ఘటన కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటన ఏప్రిల్ 18న జరిగింది. కేరళలోని పేరూర్కడలోని ఒమనా అనే మహిళ ఇంట్లో బిందు పనిమనిషిగా పనిచేస్తోంది. ఏప్రిల్ 18, 2025న ఒమనా తన ఇంట్లో గోల్డ్ చైన్ కనిపించడం లేదని గోలగోల చేసింది. పని మనిషి బిందునే దొంగతనం చేసిందని ఇంటి యజమాని నిందించింది.

దాదాపు ఐదు రోజులు బిందు అనే సదరు మని మనిషిని ఇంట్లోనే ఉంచి చిత్రవధ చేసింది. తనకు ఏ పాపం తెలియదని, తాను దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా ఇంటి యజమాని పట్టించుకోలేదు. ఇంట్లో హింసించింది చాలదన్నట్టు ఐదు రోజుల తర్వాత ఏప్రిల్ 23న బిందుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పేరూర్కడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్జె ప్రసాద్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమార్ రంగంలోకి దిగారు. పని మనిషి బిందును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి 20 గంటల పాటు విచారణ పేరుతో నరకం చూపించారు. తాగడానికి నీళ్లివ్వలేదు. తిండి పెట్టలేదు. నిద్రపోనివ్వ లేదు. ఆమెను విచారణకు తీసుకెళ్లినట్టు ఆమె కుటుంబానికి కనీస సమాచారం ఇవ్వలేదు. దొంగతనం చేయకపోయినా చేసినట్టు ఒప్పుకోవాలని బిందును ఒత్తిడి చేశారు. ఆమె దొంగతనం చేసిందని తప్పుడు కేసు బనాయించారు.

ఇంతలో ఆ గోల్డ్ చైన్ అదే ఇంట్లో సోఫాలో దొరికింది. ఇంటి యజమాని ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. అయితే.. ఇలా ఫేక్ కేసు పెట్టి టార్చర్ చేసినట్లు బయటపడితే తమ ఉద్యోగాలు డేంజర్లో పడతాయని ఎస్ఐ, ఏఎస్ఐ భావించారు. పనిమనిషి బిందును హింసించిన విషయం బయటపడితే ఇద్దరికీ చిప్పకూడు తప్పదని  ఇంటి యజమాని, ఆమె కూతురు కూడా భయపడ్డారు. వీళ్లంతా కలిసి ఆ చైన్ చెత్తలో దొరికిందని కొత్త కథ అల్లారు. పని మనిషి బిందునే తీసి ఎవరికీ అనుమానం రాకుండా చెత్త కుండీ దగ్గర పడేసిందని కట్టు కథ సృష్టించారు. తనకు, ఈ దొంగతనానికి ఎలాంటి సంబంధం లేదని బిందు కేసు పెట్టింది. 

ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి క్రైం బ్రాంచ్ ఈ కేసును  విచారించింది. అప్పుడే అసలు ట్విస్ట్ బయటపడింది. అసలు గోల్డ్ చైన్ దొంగతనమే జరగలేదని క్రైం బ్రాంచ్ తేల్చింది. ఇంటి యజమాని ఒమనాకు మతి మరుపు సమస్య ఉందని, సోఫాలో పడేసి పోయిందని.. పని మనిషి దొంగతనం చేసిందని నానా రచ్చ చేసిందని క్రైం బ్రాంచ్ విచారణలో వెల్లడైంది. దీంతో.. కేరళ ప్రభుత్వం పోలీసుల తీరుపై, ఇంటి యజమాని, ఆమె కూతురిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఒక అమాయకురాలిపై తప్పుడు కేసు బనాయించినందుకు ఎస్ఐ, ఏఎస్ఐ, ఇంటి యజమాని, ఆమె కూతురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.