చూపు లేనోళ్లకు రంగుల ప్రపంచం చూపించే డివైస్​

చూపు లేనోళ్లకు రంగుల ప్రపంచం చూపించే డివైస్​

చుట్టూ చీకట్లే తప్ప వెలుగు లేని జీవితాలు అంధులవి. ఏ పనీ చేయలేని పరిస్థితి వాళ్లది. అలాంటి వాళ్ల కోసమే యూనివర్సిటీ ఆఫ్​ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్​ న్యూ సౌత్​వేల్స్​ఓ డివైస్​ను తయారు చేశాయి. కళ్లు లేకపోయినా రంగుల ప్రపంచాన్ని చూపించేలా ‘ఫీనిక్స్​99’ అనే డివైస్​కు ప్రాణం పోశాయి. జంతువుల్లో ఇప్పటికే ఆ పరికరం సక్సెస్​ఫుల్​గా పనిచేయడంతో.. మనుషులపై ట్రయల్స్​ చేసేందుకు సిద్ధమయ్యాయి. అంధుల కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లద్దాల్లోని కెమెరాకు ఫీనిక్స్​99ను వైర్​లెస్​గా కనెక్ట్​ చేస్తారు. ఆ అద్దాలను పెట్టుకోవడం ద్వారా పనిచేయని కంటిలోని రెటీనా కణాలను ఫీనిక్స్​99 స్టిమ్యులేట్​ చేస్తుంది. రెటీనా కణాలు బయటి కాంతిని తీసుకునేలా చేసి కళ్లద్దాల్లోని కెమెరా ద్వారా ప్రపంచాన్ని చూపిస్తుంది. దీని వల్ల ఎలాంటి చెడు ప్రభావాలూ రావడం లేదని ఆ డివైస్​ను టెస్ట్​ చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్​ సిడ్నీ బయోమెడికల్​ ఇంజనీర్​ శామ్యూల్​ ఎగెన్​బర్గర్​ చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతటా 220 కోట్ల మంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నట్టు డబ్ల్యూహెచ్​వో లెక్కలు చెప్తున్నాయి. అలాంటి వాళ్లందరికీ ఇది ఓ వరం అనే చెప్పాలి.