బయోఫార్మా శక్తి: భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేలా నిర్మలమ్మ బడ్జెట్ 2026

బయోఫార్మా శక్తి: భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేలా నిర్మలమ్మ బడ్జెట్ 2026

BioPharma Shakti: కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య, ఔషధ తయారీ రంగానికి సరికొత్త ఊపిరి పోశారు. ఇండియాను ప్రపంచ బయోఫార్మాస్యూటికల్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ‘బయోఫార్మా శక్తి’ అనే వినూత్న కాన్సెప్ట్ తో కొత్త బడ్జెట్లో ముందుకొచ్చారు. రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను ఈ స్కీమ్ కోసం ఏకంగా రూ.10వేల కోట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో భారత ఫార్మా రంగం మరో మెట్టు పైకి ఎదగనుంది.

కీలక మౌలిక వసతుల కల్పన.. 
ఈ చొరవలో భాగంగా దేశవ్యాప్తంగా మూడు కొత్త జాతీయ బయోఫార్మాస్యూటికల్ సంస్థలను స్థాపించనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న 7 సంస్థలను అత్యాధునిక సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. మందుల నాణ్యత, నియంత్రణను మరింత కఠినతరం చేసేందుకు 'సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్'ను కూడా ఆధునీకరించనున్నారు. ఔషధాల పరిశోధన కోసం దేశవ్యాప్తంగా వెయ్యి గుర్తింపు పొందిన ట్రయల్ సైట్‌లను నెట్‌వర్క్‌గా ఏర్పాటు చేయడం ఈ బడ్జెట్‌లోని మరో కీలక అంశం.

సామాన్యుడికి సరసమైన ధరలకే మందులు.. 
బయోఫార్మా శక్తి కేవలం పరిశ్రమలకే కాకుండా.. సామాన్య ప్రజలకు కూడా మేలు చేయనుంది. నాలెడ్జ్, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా బయోలాజిక్స్, బయోసిమిలర్స్ వంటి ఖరీదైన మందులను స్వదేశీ మార్కెట్లోనే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. దీనివల్ల క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధులకు వాడే మందుల ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఈ బడ్జెట్ ప్రకటనలతో స్టాక్ మార్కెట్లో ఫార్మా షేర్లు భారీగా లాభపడ్డాయి. విమ్టా ల్యాబ్స్, సన్ ఫార్మా వంటి కంపెనీల షేర్లు 7 నుంచి 11 శాతం వరకు పెరగడం ఆర్థిక మంత్రి ప్రకటించిన స్కీమ్ పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తూ.. స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా నిర్మలమ్మ వేసిన ఈ అడుగు భారత బయోఫార్మా రంగానికి గేమ్ ఛేంజర్ కానుందంటున్నారు ఫార్మా నిపుణులు.