
ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు నందిగం సురేష్ వరకు.. మిల్కా సింగ్ నుంచి మిథాలీరాజ్ వరకు ఇదే హవా కొనసాగుతోంది. స్పోర్ట్స్ స్టార్ అయినా సరే పొలిటికల్ లీడర్ అయినాసరే.. వాళ్ల గురించి ప్రపంచానికి చెప్పాలనుకుంటే చాలు అది వెంటనే బయోపిక్ రూపంలో వెండితెరపై ప్రత్యక్షమమ్వాల్సిందే.
వెండితెరపై బయోపిక్ ల రూపంలో..
ఒకప్పుడు ఆటో బయోగ్రఫీ రాయించుకునేవాళ్లు. అది రాజులకాలం నుంచి వస్తున్నదే. అలా కాలక్రమేనా పుస్తకాల నుంచి పాటల రూపందాల్చింది. ఇప్పుడది బయోపిక్ ల రూపంలో వెండితెరపై ప్రత్యక్షమౌతోంది. అయితే వెండితెరపై వచ్చిన బయోపిక్ లలో కొన్ని మాత్రమే బాక్సాఫిస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే... మిగతావి రిలీజ్ అయినరోజే మాయమైపోతున్నాయి. బాక్సాఫిస్ వద్ద హిట్టా.. ఫట్టా.. అన్నది పక్కన పెడితే ప్రస్తుతం తమ జీవితాన్ని కథ రూపంలో తెరమీదికి ఎక్కించుకోవాలని ఆశపడేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అందులో క్రీడాకారులతో పాటు రాజకీయనాయలు ఉన్నారు. కొంతమంది తాము సాధించిన విజయాలను, విజయాల వెనకున్న కష్టాలను, ఆ కష్టాలను ఎలా ఎదుర్కొన్నారన్నదానిపై ప్రజలకి తెలియాలని, దాని నుంచి ప్రజలు ఇన్స్పైర్ అవ్వాలని సినిమాలు తీస్తుంటే.. మరికొంతమంది మాత్రం అదే సినిమాని ఆయుధంగా వాడుకుంటూ, తమ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనుకునేవాళ్లు ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బాక్సాఫిస్ వద్ద హిట్ కొట్టాయి..
తెలుగు, హింది, తమిళ్ వంటి వివిధ బాషల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో బయోపిక్ లు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. సినీనటి సావిత్రి, దివంగత నేత ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, ఫ్లైయింగ్ సిఖ్ గా పిలవబడే మాజీ అథ్లెట్ మిల్కాసింగ్, బాక్సర్ మేరీకోమ్ ల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సావిత్రి, యాత్ర, ఎమ్.ఎస్.ధోని అన్ టోల్డ్ స్టోరీ, మేరీకోమ్ సినిమాలు బాక్సాఫిస్ వద్ద హిట్ కొట్టాయి. ఇండస్ట్రీలో సక్సెస్ టాక్ తో పాటు కమర్షియల్ గాను సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఇందుకు కారణం ఆయా సినిమాల్లో నటించిన నటులే. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, యాత్ర సినిమాలో మమ్ముట్టీ, ధోని సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, మేరికోమ్ సినిమాలో ప్రియాంక చోప్రా నటించారు. వీళ్లు సినిమాల్లో నటించారు అనే దానికంటే.. ఆయా పాత్రల్లో జీవించారు అనాలేమో. వీరి నటనతో పాటు వారి జీవిత కథని ఒక సినిమాగా మలిచినవైనం, సాంగ్స్, ఆర్.ఆర్... ఇలా ప్రతీది సినిమాకి ప్లస్సే అని చెప్పాలి.
డైరెక్టర్ విఫలమే కారణం..
వీటితో పాటు.. క్రికెట్ దేవుడిగా కొలిచే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రపై వచ్చిన సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్, కపిల్ దేవ్ పై వచ్చిన 83 సినిమా, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పై వచ్చిన సైనా, మిథాళీ రాజ్ పై వచ్చిన శభాష్ మీథు సినిమాలు సాధారణ ప్రేక్షకులనే కాదు.. వారి అభిమాల్ని సైతం ఆకట్టుకోలేకపోయాయి. తెలుగు ప్రజలు దేవుడిలా కొలిచే నందమూరి తారకరామారావుపై వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సైతం అనుకున్న స్థాయిలో హిట్ టాక్ రాబట్టుకోలేకపోయింది. ఇక వాళ్లేం సాధరణ వ్యక్తులు కాదు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నత శిఖరాలకు చేరినవాళ్లే. ఆయా క్రీడల్లో ప్రపంచస్థాయిలో సత్తా చాటినవాళ్లే. వాళ్ల పాత్రల్లో నటించినవాళ్లు సైతం ఎన్నో హిట్ సినిమాల్లో నటించినవాళ్లే. కానీ తమ జీవిత చరిత్రని సినిమాగా సరిగ్గా తెరకెక్కించడంలో డైరెక్టర్ విఫలమవ్వడమే కారణం అనేవాళ్లు ఉన్నారు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీపై పిఎమ్ నరేంద్రమోడి సినిమాలు వచ్చాయి.
ఒకరిని చూసి ఒకరు..
ఇక ఒకరిని చూసి ఒకరు తమ జీవితాన్ని సినిమాల రూపంలో తీసుకొస్తున్నారు. అందులో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ తారలు ఉన్నారు. ఇప్పుడు వీరి బాటలోనే తన బయోపిక్ ని తీయించుకుంటున్నాడు బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఇక ద్రోణాచార్య అవార్డీ, ఇండియన్ బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లేల గోపిచంద్ బయోపిక్ వస్తోందంటూ గత నాలుగేళ్లుగా టాక్ నడుస్తూనే ఉంది. దీంతో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా బయోపిక్ తీయించుకోవాలని ఉందని చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. తన రోల్ ని దీపిక పదుకునే చేస్తే బాగుంటదని తన మనసులో మాటని బయటపెట్టింది. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవి సింధు సైతం తనపై బయోపిక్ తీయించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తన బయోపిక్ లో తానే నటించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల సరదాగా కామెంట్ కూడా చేసింది. మరి ఇకముందు తెరకెక్కనున్న బయోపిక్స్ ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.