
హైదరాబాద్, వెలుగు: ఆదిత్య బిర్లా గ్రూప్ డెకరేటివ్ పెయింట్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రానున్న మూడేళ్లలోనే రూ.10 వేల కోట్ల రెవెన్యూని ఈ బిజినెస్ సాధిస్తుందని కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అంచనా వేశారు. బిర్లా ఓపస్ కింద మూడు ప్లాంట్లలో పెయింట్స్ బిజినెస్ కార్యకలాపాలను ఆదిత్య బిర్లా గ్రూప్ మొదలు పెట్టింది. మూడో ఏడాది నాటికి లాభాల్లోకి రావాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని కుమార్ మంగళం బిర్లా అన్నారు. పానిపట్ (హర్యానా), లుధియానా (పంజాబ్), చెయ్యర్ (తమిళనాడు) లోని బిర్లా ఓపస్ ప్లాంట్లను ఆయన గురువారం ప్రారంభించారు.
కాగా, ఆదిత్య గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ.10 వేల కోట్ల క్యాపెక్స్‌తో డెకరేటివ్ పెయింట్స్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతామని కిందటేడాది ప్రకటించింది. 2025 నాటికి ఆరు తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఈ ప్లాంట్లు హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌లో ఏర్పాటు చేశారు. వీటి మొత్తం కెపాసిటీ ఏడాదికి 1,332 మిలియన్ లీటర్లు. డెకరేటివ్ పెయింటింగ్ మార్కెట్ సైజ్ రూ.80 వేల కోట్లు ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.