త్వరలోనే సీఆర్ఎస్ ద్వారా.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ

త్వరలోనే సీఆర్ఎస్ ద్వారా.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
  • సీఎం అనుమతి కోసం ప్రపోజల్స్​ పంపిన బల్దియా  
  • ఓకే అయిన వెంటనే   కేంద్ర పోర్టల్ కు డేటా బదిలీ 
  • ఇక ఫేక్​కు అవకాశమే ఉండదు 

హైదరాబాద్ సిటీ, వెలుగు:నగరంలో చాలా మంది రోహింగ్యాలు అడ్డదారిలో బర్త్, డెత్ సర్టిఫికెట్లను సమకూర్చుకొని ఇక్కడే తిష్ట వేస్తుండడం, ఇతరులు కూడా తప్పుడు దారిలో సర్టిఫికెట్లు తీసుకుంటుండడంతో సీఆర్ఎస్​(సివిలియన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్) ద్వారా జారీ చేయడానికి బల్దియా సిద్ధమైంది. గత ఏడాది నవంబర్ లో యూసుఫ్ గూడ సర్కిల్ పరిధిలోని బర్త్ ఎట్ హోమ్, డెత్ ఎట్ హోమ్ పేరిట అడ్డదారిలో సర్టిఫికెట్లు జారీ కావడంతో అప్పటి కమిషనర్ ఇలంబరితి విచారణకు ఆదేశించారు. 

అక్రమాలు జరిగాయని వెల్లడి కావడంతో 16 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పరిధిలోకి జీహెచ్ఎంసీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల ప్రక్రియను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అంగీకరించిన కేంద్రం ఇప్పటికే ఓ దఫా అధికారులతో జూమ్ మీటింగ్ కూడా నిర్వహించింది. 

అయితే, ఇలంబరితి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని సెన్సెస్​విభాగంలో ఉన్నప్పుడే సీఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నించినా, అప్పటి రాష్ట్ర సర్కారు అంగీకరించలేదని సమాచారం. 

జీహెచ్ఎంసీ కమిషనర్ అయిన తర్వాత బోగస్ సర్టిఫికెట్ల జారీకి శాశ్వతంగా చెక్ పెట్టాలన్న ఆలోచనతో సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ద్వారా యూనిక్ నెంబర్ తో బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేసే ప్రక్రియను అమలు చేయాలని నిర్ణయించారు.

సీఎం పర్మిషన్​ కోసం వెయిటింగ్

ప్రస్తుతం కేంద్రం పోర్టల్ కు వివరాలిచ్చేందుకు సర్కారు పర్మిషన్​కోరుతూ జీహెచ్ఎంసీ అధికారులు సీఎం ఆఫీసుకు ప్రతిపాదనలు పంపారు. సీఎం రేవంత్​రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కూడా కావడంతో ఆయన అనుమతి కోసం వేచి చూస్తున్నారు. ఓకే కాగానే, జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు జారీ చేసిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల డేటాను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న సీఆర్ఎస్ పోర్టల్ కు బదిలీ చేస్తారు. 

తర్వాత సీఆర్ఎస్ ద్వారా యూనిక్​నెంబర్​తో సర్టిఫికెట్​జనరేట్ చేస్తే దేశంలో ఎక్కడి నుంచైనా తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఇప్పటి వరకు బల్దియాలో జనరేట్ అయిన జనన, మరణాల డేటాను కూడా సెంట్రల్ పరిధిలోని యాప్ లోకి ట్రాన్స్ ఫర్ చేసేందుకు జీహెచ్ఎంసీ రెడీగా ఉంది.