ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు చేదు అనుభవం.. నిలదీసిన మూలమరి తండా వాసులు

ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు చేదు అనుభవం.. నిలదీసిన మూలమరి తండా వాసులు

డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి ఏం చేశావంటూ మరిపెడ మండలం మూలమరి  తండా వాసులు ఎమ్మెల్యేను నిలదీశారు. మూలమరి  తండా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన స్థానికులు.. గ్రామానికి వెంటనే తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు ఎమ్మెల్యే సమక్షంలోనే అధికార పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామాభివృద్ధి నిధులపై ఎమ్మెల్యే వివక్షత చూపుతున్నారని స్థానిక సర్పంచ్ తేజవత్ జెగని కుమారుడు భారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మంత్రి సత్యవతి రాథోడ్  అనుచరులం కాబట్టే రెడ్యానాయక్ ఇతర వర్గాలను పెంచి పోషిస్తూ.. తమను మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ తనయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌పై వరుసగా జ‌నం తిరుగుబాటు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం డోర్నకల్ మండల పరిధిలోని బోడహట్య తండాలో బొడ్రాయి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను తండావాసులు, మహిళలు అడ్డుకున్నారు. తమ గ్రామానికి ఏం చేశావో..? ఏమిచ్చావో చెప్పాలంటూ ఎమ్మెల్యేపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకు పట్టుకున్న ఎమ్మెల్యేను మాట్లాడకుండానే గ్రామ‌స్థులు తిరిగి పంపించారు.