ఏం చేసిన్రని మల్లా వచ్చిన్రు..!

ఏం చేసిన్రని మల్లా వచ్చిన్రు..!
  • ఏం చేసిన్రని మల్లా వచ్చిన్రు!
  • మిషన్‌‌ భగీరథ నీళ్లు మాకొద్దు
  • మా బాయి నీళ్లే సరఫరా చేయుర్రి 
  • ఎమ్మెల్యే, జడ్పీ చైర్​పర్సన్​నిలదీసిన జోగంపల్లి గ్రామస్థులు

 

శాయంపేట, వెలుగు : 'ఎలక్షన్ల టైంలో హామీలిచ్చి పోయిన్రు.. మల్లా మూడేండ్ల తర్వాత ఇప్పుడే కన్పించిన్రు. మీరేం అభివృద్ధి చేసిన్రని వచ్చిన్రు’ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌‌ జడ్పీ చైర్​పర్సన్ ​గండ్ర జ్యోతిలను జోగంపల్లి గ్రామస్థులు నిలదీశారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లిలో శుక్రవారం పల్లె ప్రగతి, మన ఊరు‒మన బడి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే, జడ్పీ చైర్​పర్సన్​తో పాటు కలెక్టర్‌‌ రాజీవ్‌‌ గాంధీ హన్మంతు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ 'డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్లు ఇప్పటి వరకు కట్టియ్యలేదు. సీసీ రోడ్లు వేయలేదు. కొత్త ఆసరా పింఛన్లియ్యలేదు. మిషన్‌‌ భగీరథ నీళ్లు తాగడానికి ఇబ్బంది పడుతున్నం. మిషన్​భగీరథ అని చెప్పి మంచినీటి బావుల్లో ఉన్న మోటార్లు తీసేసిన్రు. అవి ఎక్కడున్నయ్​. సర్పంచ్‌‌ ఇంట్లో పెట్టుకున్నడా.. జీపీ ఆఫీస్‌‌లో ఉన్నయా? మాకు మా పాత బావుల్లో నీటినే సరఫరా చేయండి’ అని అన్నారు. అయితే ఎలక్షన్ల కోసం వచ్చేవాళ్లు వేరే ఉన్నరని, తాము వచ్చింది రాజకీయం కోసం కాదని, గ్రామాభివృద్ధి కోసమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమాధానమిచ్చారు.