హిల్ట్ పాలసీతో సర్కార్ ‘రియల్’ దందా : బీజేపీ రాష్ట్ర నేతలు

హిల్ట్ పాలసీతో సర్కార్ ‘రియల్’ దందా :  బీజేపీ రాష్ట్ర నేతలు
  •     పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర 
  •     కన్వర్షన్ పేరుతో రూ.లక్షల కోట్ల స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెరలేపిన కాంగ్రెస్ 
  •     గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిష్ణుదేవ్ వర్మకు బీజేపీ నేతల ఫిర్యాదు 
  •     డిసెంబర్ 7న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా:బీజేపీ నేతలు రాంచందర్ రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల విలువైన పారిశ్రామిక భూములను కాంగ్రెస్ సర్కార్ ‘హిల్ట్’ పాలసీ పేరుతో రియల్టర్లకు దోచిపెడుతోందని బీజేపీ రాష్ట్ర నేతలు విమర్శించారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూములను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం భారీ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేసిందని ఆరోపించారు. 

సోమవారం రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బీజేఎల్​పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. వెంటనే జీవో నెంబర్ 27ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరింది. దీనిపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. 

అనంతరం రాంచందర్​రావు, మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ పరిధిలోని 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న 9,292 ఎకరాల భూమిని మల్టీ-పర్పస్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. 

బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎకరం భూమి రూ.150 కోట్లు పలుకుతుంటే.. కేవలం 30 శాతం ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో రేటు కట్టి భూములు సొంతం చేసుకునేలా నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం గల్లంతవుతుందని, ప్రజాధనం రియల్టర్ల జేబుల్లోకి వెళ్తుందని గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించారు.

 అదే ప్రాంతంలో రైతులు తమ భూములను కన్వర్ట్ చేయాలని ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. రైతుల గోడు వినిపించుకోని సర్కార్.. బడా బాబుల కోసం ఇండస్ట్రియల్ భూములను మాత్రం రాత్రికి రాత్రే కన్వర్ట్ చేస్తున్నదని విమర్శించారు. పరిశ్రమలు రియల్ వెంచర్లుగా మారితే.. అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.

డిసెంబర్ 7న మహాధర్నా

సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ, హిల్ట్ పాలసీ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా డిసెంబర్ 7న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ‘మహా ధర్నా’ నిర్వహించనున్నట్లు రాంచందర్ రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ప్రజల హక్కుల కోసం చేసే ఈ పోరాటంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.