Mission 90 : తెలంగాణ కోసం ’’సరళ్‘‘ యాప్

Mission 90 : తెలంగాణ కోసం ’’సరళ్‘‘ యాప్

మిషన్ 90 లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదనుపెడుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీరియస్ గా దృష్టి పెట్టిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ బన్సల్ పోలింగ్ బూత్ స్థాయి నుంచి కేడర్ ను పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 7,61,200 మంది పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఎంపిక చేశారు. ఈ నెల 7న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వారందరితో వర్చువల్ గా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు. తెలంగాణ కోసం బీజేపీ ప్రత్యేకంగా సరళ్ యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఆ యాప్ లో బూత్ కమిటీల వివరాలు, పార్టీ వ్యవహారాలు పొందుపరచనున్నారు.

ఇదిలా ఉంటే ఎంపిక చేసిన పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలందరికీ బీజేపీ ఐడీ కార్డులతో పాటు డైరీలు అందజేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డైరీలు మెయింటెన్ చేయాలని వారికి ఆదేశించింది. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీపరంగా బూత్ స్థాయిలో సమస్యలు, వాటి పరిష్కారానికి చర్యలతో పాటు పార్టీ బలోపేతానికి సంబంధించి అన్ని వివరాలు సేకరించాలని కార్యకర్తలకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,600 పోలింగ్ బూత్ లు ఉండగా.. ఒక్కో దానికి 22 మంది కార్యకర్తల్ని నియమించారు. వారిలో ఒకరు సోషల్ మీడియా బాధ్యతలు చూసుకోనున్నారు.