
- చత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్
- డిప్యూటీ సీఎంలుగా విజయ్ శర్మ, అరుణ్ సావ్
- స్పీకర్‌గా మాజీ సీఎం రమణ్ సింగ్ !
రాయ్‌పూర్ : వారం రోజుల ఉత్కంఠకు తెరదించుతూ చత్తీస్‌గఢ్ సీఎం పేరును బీజేపీ ప్రకటించింది. వినయ విధేయ రాముడిగా పేరు పొందిన ఆదివాసీ నేత విష్ణు దేవ్ సాయ్‌ని ముఖ్యమంత్రిగా నియమించింది. 2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. విష్ణుదేవ్ వైపు మొగ్గు చూపింది. ఆదివారం రాయ్‌పూర్‌లో జరిగిన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో 54 మంది ఎమ్మెల్యేలు విష్ణుదేవ్‌ను బీజేపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. తర్వాత విజయ్ శర్మ, అరుణ్ సావ్‌లను డిప్యూటీ సీఎంలుగా పార్టీ హైకమాండ్ నియమించింది. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. 2003 నుంచి 2018 దాకా వరుసగా మూడు సార్లు సీఎంగా పని చేసిన రమణ్ సింగ్‌ను స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
సర్పంచ్ టు సీఎం
ఆర్ఎస్‌ఎస్‌లో పనిచేసిన 59 ఏండ్ల విష్ణు దేవ్ సాయ్ వివాద రహితుడు. వినయం, డౌన్ టు ఎర్త్‌గా ఉండటం, అంకితభావం, లక్ష్యాలను సాధించాలనే తపన కలిగిన వ్యక్తి అని పేరుంది. జష్‌పూర్ జిల్లాలోని బాగియా ఆయన సొంతూరు. కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తాత బుద్ధనాథ్ సాయ్.. నామినేటెడ్ ఎమ్మెల్యేగా 1947 నుంచి 1952 దాకా కొనసాగారు. విష్ణుదేవ్ పెద్ద నాన్నలు నరహరి ప్రసాద్ సాయ్, కేదార్‌నాథ్ సాయ్ కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్లే. గ్రాడ్యుయేషన్‌ను మధ్యలోనే వదిలేసి 1988లో సొంతూరుకు వచ్చిన విష్ణుదేవ్.. 1990లో బాగియా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఏడాది బీజేపీ టికెట్‌పై తప్‌కారా ఎమ్మెల్యేగా గెలిచారు. 1993లో గెలిచి, 1998లో ఓడారు.
1999, 2004, 2009, 2014 పార్లమెంటు ఎన్నికల్లో రాయ్‌గఢ్ నుంచి వరుసగా గెలుపొందారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్ దక్కలేదు. మాజీ సీఎం రమణ్‌సింగ్‌కు సన్నిహితుడని పేరుంది. చత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా మూడుసార్లు కొనసాగారు. అంతకుముందు బీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో కుంకురి నుంచి 25,541 ఓట్ల మెజారిటీతో విష్ణు దేవ్ గెలుపొందారు.
మోదీ సూచనతోనే!
చత్తీస్‌గఢ్‌లో ట్రైబల్స్ పాపులేషన్ దాదాపు 32%. ఓబీసీల తర్వాత అత్యధిక జనాబా వీరిదే. రాష్ట్ర సీఎంగా ఆదివాసీ లీడర్ ఉండాలని ప్రధాని మోదీ సూచించి నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విస్తృత చర్చల తర్వాత విష్ణుదేవ్ వైపు హైకమాండ్ మొగ్గుచూపింది. గత నెలలో కుంకురిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా కూడా ఈమేరకు హింట్ ఇచ్చారు. ‘‘విష్ణు దేవ్‌ను గెలిపించండి. పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే ‘బిగ్ మ్యాన్’ అవుతారు” అని చెప్పడం గమనార్హం. మరోవైపు, తనను సీఎంగా నియమించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఇతర పార్టీ లీడర్లకు విష్ణు దేవ్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘సీఎంగా.. ప్రధాని మోదీ గ్యారంటీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తా” అని తెలిపారు. విష్ణు దేవ్‌కు మాజీ సీఎం బాఘెల్ అభినందనలు తెలిపారు.