బీహార్ దంగల్: రేపే ( నవంబర్ 11 ) తుదివిడత పోలింగ్.. 20 జిల్లాల్లోని 122 సెగ్మెంట్లలో ఓటింగ్

బీహార్ దంగల్: రేపే ( నవంబర్ 11 ) తుదివిడత పోలింగ్.. 20 జిల్లాల్లోని 122 సెగ్మెంట్లలో ఓటింగ్
  • బరిలో  1,302 మంది అభ్యర్థులు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న  3.7 కోట్ల మంది  

ఢిల్లీ: బీహార్ తుది దశ పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. హోరా హోరీగా సాగిన ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. ఎన్డీఏ, మహాఘట్ బంధన్ హోరా హోరీగా తలపడుతున్న ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉత్కంఠగా మారింది. మొత్తం 243 స్థానాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 122 సెగ్మెంట్లకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3.7 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

ఈ నెల 14న 243 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. మేజిక్ ఫిగర్ సాధించిన పార్టీ ప్రభుత్వంలో కొలువుదీరుతుంది. రేపటి ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కంపెనీలు (సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటిబీపీ, ఎస్‌ఎస్‌బీ) మోహరించాయి. 

అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించారు. పోలింగ్ రూమ్‌లోకి మొబైల్ ఫోన్లు అనుమతించరని అధికారులు హెచ్చరించారు.