‘సీతారామ’ నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి

‘సీతారామ’ నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి

ములకలపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్టు నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి డిమాండ్​ చేశారు. ములకలపల్లి మండలంలో సీతారామ ప్రాజెక్టు కాలువపై కట్టిన పాసేజ్ పిల్లర్ కూలిన ప్రదేశాన్ని శనివారం బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో  నీరు విడుదల మొదలు కాకముందే ప్రధాన కాలువల పిల్లర్లు కూలడం దారుణమన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం మొదట సుమారు రూ.6,700 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని, ఆ తరువాత ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.13,500 కోట్లకు పెంచిందని, ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం ఏకంగా రూ.19,800 కోట్లకు సిద్ధం చేసింది కానీ ఎవరూ నాణ్యతను పట్టిచుకోవడం లేదని ఆరోపించారు. గత వర్ష కాలంలో కొద్దిపాటి ప్రవాహానికే పాల్వంచ మండలం బండ్రుగొండ వద్ద, మరి కొన్ని చోట్ల ప్రధాన రెండు కాలువలకు గండ్లు పడ్డాయని, ములకలపల్లి మండలం మాదారం సమీపంలో పాసేజ్ బ్రిడ్జ్ పిల్లర్ కుప్పకూలిపోయిందని గుర్తుచేశారు.

తక్షణమే నిర్మాణ సంస్థ చేసిన పనులపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షుడు గుగులోత్ శంకర్ నాయక్, నాయకులు తంగెళ్ల ఆంజనేయులు, బానోత్ సుధారాణి, తేజావత్ పార్వతి, తేజావత్ సూర్యం, రవికుమార్​ పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన 

అన్నపురెడ్డిపల్లి ,వెలుగు: అన్నపురెడ్డి పల్లి మండలంలోని  సొసైటీ కల్లాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్​రెడ్డి పరిశీలించారు. మర్రిగూడెం, అబ్బుగూడెం రైతులతో ఆయన మాట్లాడారు. బోనస్ డబ్బులు ఎగ్గొట్టేందుకే ధాన్యం కొనుగోళ్లల్లో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.  48 గంటల్లో వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. మర్రిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో కరెంట్ షాక్ తో  మరణించిన మామిడి రెమల్య  కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత  కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ జటంగి కృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్  బోగి కృష్ణ, అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షుడు  జె.రమేశ్ పాల్గొన్నారు.