బీజేపీ, బీఆర్ఎస్​లను ఓడించాలి.. మద్యానికి, నోటుకు ఓటు అమ్ముకోవద్దు : ఆకునూరి మురళి

బీజేపీ, బీఆర్ఎస్​లను ఓడించాలి.. మద్యానికి, నోటుకు ఓటు అమ్ముకోవద్దు : ఆకునూరి మురళి
  • ఓట్లడగడానికి వచ్చే అభ్యర్థులను నిలదీయాలె
  • సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నేత చలపతిరావు

నల్గొండ అర్బన్, వెలుగు : దేశం, రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వంతో, దోపిడీ చేస్తూ పాలిస్తున్న బీఆర్ఎస్, బీజేపీలను ఓడించాలని రిటైర్డ్ ఐఏఎస్, జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం జాగో తెలంగాణ‌‌-, తెలంగాణ రాష్ట్ర  ప్రజాస్వామిక వేదిక(టీఎస్​డీఎఫ్​) సంయుక్తంగా అన్ని నియోజకవర్గాల్లో  ‘ఓటర్ల చైతన్య యాత్ర’ పేరుతో బస్సు టూర్​ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నల్లగొండలోని ఎన్జీ కాలేజీ, అంబేద్కర్ విగ్రహం, గడియారం సెంటర్, జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగులతో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ప్రజలు మద్యానికి, నోటుకు, కులానికి, మతానికి లోబడకుండా ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఇన్నేళ్లు పాలించిన వారు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, యువత, నిరుద్యోగులను ఆదుకోవడంలో విఫలమై ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారన్నారు.

అలాంటి పార్టీలకు సరైన రీతిలో బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు.  సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జె.వి చలపతిరావు మాట్లాడుతూ ఓట్లడగడానికి వచ్చే బీఆర్ఎస్ అభ్యర్థులను వారు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని నిలదీయాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడని, రుణమాఫీ, దళిత బంధు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, పంటల బీమా, ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లపై ప్రశ్నించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 36 లక్షల ఎకరాలకు సాగునీరస్తామని చెప్పారని, కనీసం లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదన్నారు. బడా కార్పోరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక సలహాదారు ప్రొఫెసర్​ వినాయక్ రెడ్డి, టీజేఎస్ ​జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి, కో కన్వీనర్ ఎం.హన్మేశ్, నైనాల గోవర్ధన్, ప్రదీప్, రాజ్ కుమార్, ఇందూరు సాగర్, పోలె పవన్, బొంగరాల నర్సింహా, బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రావుల సైదులు, కళాకారులు బాల నరసయ్య, కరుణాకర్ పాల్గొన్నారు.