కరీంనగర్లో రణరంగం..చిచ్చు రేపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్

కరీంనగర్లో రణరంగం..చిచ్చు రేపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్
  •     తంబాకులో డ్రగ్స్ కలిపి తీసుకోవడం వల్లే బండి సంజయ్​ జుట్టు ఊడిందని వివాదాస్పద వ్యాఖ్యలు
  •     పాడి కామెంట్స్​పై భగ్గుమన్న బీజేపీ శ్రేణులు.. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి
  •     ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెహికల్, ఆఫీసులో పూలకుండీలు, అద్దాలు ధ్వంసం
  •     ఆ సమయంలో క్యాంప్ ఆఫీసులోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
  •     బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ
  •     పోలీసుల లాఠీచార్జీ, బీజేపీ నాయకుల అరెస్టు
  •     కౌశిక్ రెడ్డిని బందోబస్తు మధ్య హుజురాబాద్​కు తరలించిన పోలీసులు

కరీంనగర్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్​పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురువారం చేసిన అనుచిత వ్యాఖ్యలు కరీంనగర్​లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతూ కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఆవరణలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై కర్రలతో దాడికి దిగారు. పూల కుండీలను పగులగొట్టి  ఫర్నిచర్ ధ్వంసం చేయడంతోపాటు కౌశిక్​ రెడ్డిపై దాడికి యత్నించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు వెంటనే ఆయన్ను  ఓ రూమ్​లోకి తీసుకెళ్లారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు లాఠీచార్జీ చేయడమేగాక బీజేపీ కార్పొరేటర్ బోయిన్ పల్లి ప్రవీణ్ కుమార్ తోపాటు పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి బందోబస్తు మధ్య హుజురాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు తరలించారు. బీజేపీ శ్రేణుల దాడిలో కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడి అనంతరం కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కరీంనగర్ ఎంపీ క్యాంప్ ఆఫీసుపై దాడి చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 

చిచ్చు రేపిన కౌశిక్ రెడ్డి కామెంట్స్.. 

కౌశిక్ రెడ్డి గురువారం ఉదయం కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ లో శాంతిభద్రతలు క్షీణించాయని, బండి సంజయ్ ఒక బాధ్యత గల హోంశాఖ సహాయ మంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు. బండి సంజయ్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో భారీ దోపిడీ జరిగితే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా బండి సంజయ్ ఒక్క రివ్యూ కూడా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. 'నేను సవాల్ విసురుతున్న. కేటీఆర్ ను డ్రగ్స్ అన్నవ్ కదా. కేటీఆర్ టెస్టింగ్ కు రావడానికి సిద్ధంగా ఉన్నడు. టైం డేట్ ఫిక్స్ చేయ్..  బండి సంజయ్, కేటీఆర్, రేవంత్ రెడ్డి ముగ్గురికి డ్రగ్స్ టెస్టు చేపిద్దాం రండి. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో తెలిసిపోతది కదా ప్రజలకు. మీరు నోటికొచ్చినట్లు మాట్లాడితే మేం కూడా మాట్లాడగలం. ఇయ్యాల మేం కూడా అనొచ్చు కదా.. బండి సంజయ్  డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే వెంట్రుకలన్నీ ఊడిపోయాయి. సైడ్ ఎఫెక్ట్ తో  గుండు అయిందని అనుకుంటున్న. మరి మీకు కూడా డ్రగ్ టెస్టు చేయాలె' అని కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ బీజేపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే బీజేపీ నాయకులు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడికి దిగారు.

నా హత్యకు కుట్ర:  కౌశిక్ రెడ్డి

దాడి అనంతరం మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​తో కలిసి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి  మాట్లాడారు. తాను ఎవరినీ రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుకుని తనను హత్య చేయించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, నన్ను హత్య చేసేందుకు రెక్కీ జరుగుతోందని పొద్దున ప్రెస్ మీట్ లో చెప్పానని, అన్నట్టుగానే  పోలీసుల సాక్షిగా కర్రలు, రాళ్లతో నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బీఆర్‌‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌పై నోటికి వచ్చినట్టు తిట్టొచ్చని, దానికి తాము కౌంటర్ ఇస్తే తప్పయితదా అని ప్రశ్నించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపించడంవల్లనే  తాను కూడా బండి సంజయ్‌‌పై కామెంట్ చేశానని,  అలా తంబాకు, డ్రగ్స్ కలిపి తీసుకోవడం వల్లే తలపై జట్టు ఊడిపోయిందని అన్నానని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

హుజురాబాద్​లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. 

కరీంనగర్ నుంచి పాడి కౌశిక్ రెడ్డిని బందోబస్తు మధ్య పోలీసులు హుజురాబాద్ క్యాంపు ఆఫీసుకు తరలించారు. సమాచారం అందుకున్న సుమారు వంద మంది బీఆర్ఎస్ కార్యకర్తలు క్యాంపు ఆఫీసుకు చేరుకొని.. బీజేపీ కార్యకర్తలు వస్తే ఎదుర్కొనేందుకు కంకర రాళ్ల ట్రాక్టర్ లోడును సైతం తెప్పించుకునే ప్రయత్నం చేయగా.. గమనించిన పోలీసులు ట్రాక్టర్ ను తిప్పి పంపారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు జెండాలతో రాగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు క్యాంపు ఆఫీసు బయటకి వచ్చి బీజేపీ కార్యకర్తలపై కర్రలతో దాడికి దిగారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.  

13 మంది బీజేపీ నాయకులపై కేసు 

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై దాడికి దిగారని ఆరోపిస్తూ 13 మంది బీజేపీ నాయకులపై కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బాయ్  ములుకుంట్ల రాజు  టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీజేపీకి చెందిన సుమారు 50 మంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనాన్ని కట్టెలు, రాళ్లతో ధ్వంసం చేశారని, ఆఫీస్ అద్దాలు పగులగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువ క్రాంతి, ఎడ్ల ప్రసన్న, శివరాం, కార్పొరేటర్లు బోయిన్ పల్లి ప్రవీణ్ రావు, టింకు, బండారి వేణు, సోమిడి వేణు ప్రసాద్, బండ రమణారెడ్డి, ఎక్స్ అఫీషియో మెంబర్లు ముజీబ్, బల్వీందర్ సింగ్, కర్రె అనిల్, గుగ్గిల్లపు రమేశ్, తాజ్ తదితరులు దాడిలో పాల్గొన్నారని ఫిర్యాదు చేయగా.. పలు సెక్షన్లు సహా పీడీ యాక్ట్‌‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.