పోటీ చేయకుండానే.. 1951 నుంచి 35 మంది లోక్ సభలోకి

పోటీ చేయకుండానే.. 1951 నుంచి 35 మంది లోక్ సభలోకి

న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో సూరత్  నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి ముకేశ్  దలాల్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 12 ఏండ్లలో లోక్ సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి అభ్యర్థి ఆయనే. ముకేశ్ లాగే 1951 నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల వరకు మొత్తం 34 మంది లోక్ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2012 బైపోల్​లో కనౌజ్ లోక్ సభ నుంచి సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అభ్యర్థి, అఖిలేశ్​ యాదవ్  భార్య డింపుల్  యాదవ్  పోటీచేయకుండానే ఏకగ్రీవం అయ్యారు. ఆ సంవత్సరం ఉత్తరప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధించి అఖిలేశ్ సీఎం అయ్యారు. అప్పటి వరకూ ఆయన కనౌజ్  ఎంపీగా ఉన్నారు. 

అలాగే వైబీ చవాన్, ఫరూఖ్  అబ్దుల్లా, హరేకృష్ణ మహతాబ్, టీటీ కృష్ణమాచారి, పీఎం సయీద్, ఎస్ సీ జమీర్  కూడా పోటీచేయకుండానే లోక్ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలా ఏకగ్రీవమైన వారిలో ఎక్కువ మంది అభ్యర్థులు కాంగ్రెస్  వారే. అలాగే సిక్కిం, శ్రీనగర్  లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు రెండుసార్లు పోటీ చేయకుండానే లోక్ సభలో అడుగుపెట్టారు. 1957 సార్వత్రిక ఎన్నికల్లో గరిష్టంగా ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 1951, 1967లో ఐదుగురు చొప్పున, 1962లో ముగ్గురు, 1977లో ఇద్దరు అలా విజయం సాధించారు. 1971, 1980, 1989లో ఒక్కో అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.