
రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని ఊపులో ఉన్న బీజేపీ ఇక్కడ పాగా వేసేందుకు రెడీ అవుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకు చేసిన ప్రయోగాలను పక్కనపెట్టి, కులం కార్డు వాడాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. పార్టీ బలానికి కులాన్ని జోడిస్తే రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉందని యోచిస్తోంది. ఇందుకోసం రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను బీజేపీలో చేర్చుకుని, ఆయా వర్గాల్లో మద్దతు పెంచుకునేలా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.
లోక్‌సభ రిజల్ట్స్ లెక్క ఇదే!..
ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎంపీ సీట్లలో బీజేపీ విజయానికి సామాజిక సమీకరణాలే కారణమని ఆ పార్టీ పరిశీలనలో తేలినట్టు సమాచారం. ఆదిలాబాద్‌లో ఆదివాసీ హక్కుల నేత బాపురావును బరిలోకి దింపడం, నిజామాబాద్, కరీంనగర్ లలో స్థానికంగా బలమైన సామాజిక వర్గం నేతలు పోటీ చేయడంతో గెలుపు సులువైందని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే తరహాలో బలమైన సామాజిక వర్గాలను ఆకర్షించి, రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని అనుకుంటోంది. ఇందుకోసం ఆర్థికంగా ఎదిగి, గ్రామాలపై పట్టున్న రెడ్డి సామాజికవర్గంతో పాటు జనాభాపరంగా బలమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలపై దృష్టి సారించింది. ఇప్పటికే రెడ్డి సామాజికవర్గం నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వంటివారు బీజేపీలో చేరారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ సురేశ్‌రెడ్డి తదితర నేతలకూ గాలం వేసే ప్రయత్నం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది.
బీసీలపై స్పెషల్ ఫోకస్..
లోక్‌సభ ఎలక్షన్ల తర్వాత రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని బీజేపీ నేతల్లో ధీమా వ్యక్తమవుతోంది. అయితే టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే బలమైన బీసీలను టార్గెట్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలూ గతంలో కేంద్రానికి నివేదికలిచ్చినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే డేటా ప్రకారం బీసీల్లో కురుమ, యాదవులు, ముదిరాజ్‌లు, గౌడ్‌లు, మున్నూరు కాపులు, విశ్వ బ్రాహ్మణులు, రజకులు తదితరులు సంఖ్యాపరంగా పెద్ద సంఖ్యలో ఉన్నట్టు గుర్తించారు. వీరిని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. బలమైన బీసీ నేతలను చేర్చుకోవడంతోపాటు కీలక పదవులు వారికివ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అధికార పార్టీలోని అసంతృప్తులతోపాటు కాంగ్రెస్, టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నట్టు తెలిసింది.
ఎన్నికలకు ముందు నుంచే..
లోక్‌సభ ఎలక్షన్లకు ముందు నుంచే బీజేపీ తన వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. రెడ్డిలతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లోని బలమైన నేతలకు ఆఫర్ ఇచ్చింది. బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఓ కీలక నేతతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, రాష్ట్ర నేతలు సంప్రదింపులు జరిపారు. కృష్ణయ్యకు చేవెళ్ల, మరోనేతకు ఇంకో నియోజకవర్గం ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే తక్కువ సమయం ఉండడంతో వారు వెనుకంజ వేశారని తెలిసింది. ఎస్టీ నేతల్లో ఒక్క సోయం బాపురావు మాత్రమే పార్టీలో చేరి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. మిగతా నేతలు ధైర్యం చేసి వచ్చి ఉంటే.. బీజేపీ మరో రెండు ఎంపీ స్థానాలు గెలిచేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.